Social Icons

Pages

Sunday, 23 August 2015

ఇల్లు ఇల్లులాగా లేదు!







ఆదివారం సాయంత్రం. ఒక్కడినే ఇంట్లో. గజల్ శ్రీనివాస్ మధుర స్వరం. సీడీ ప్లేయర్ నుంచి అలలు అలలుగా గుండెను తాకుతోంది.
ఎందుకో మధ్యాహ్నం భోజనాల వేళ నుంచి వెలితిగా, గుబులుతా ఉంది. నేను, నాన్న మాత్రమే ఉన్నాం. మా అమ్మాయి కావ్య డ్యూటీలో ఉంది. అబ్బాయ్ ఆదర్శ్‌ని తీసుకుని నా వైఫ్ భవాని, చెల్లెలి కొడుకు పెళ్లికి అమెరికా వెళ్లింది. ప్రతి ఆదివారం ఉదయం కుటుంబమంతా కలిసి భోజనం చేయాలని మా ఆవిడ ఆన. బాహుబలిలో శివగామి ఆన లాంటిదే. అంత పవర్‌ఫుల్. కాబోయే అల్లుడితో సహా అందరం గత రెండు నెలల నుంచి పాటించడానికి పాట్లు పడుతున్నాం. పిల్లలందరూ ఏవో వంకలు చెప్పి జంప్ చేయాలని చూస్తారు కాని, నేను తెగ బుద్ధిగా డైనింగ్ టేబుల్ దగ్గర హాజర్. "మనిద్దరం వయసు మీద పడుతున్నవాళ్లం. పిల్లలకు మనతో బోరులే వదిలేద్దాం. వాళ్ల మానాన వాళ్లని ఆదివారం  పండుగ చేసుకోనీ" అంటే మా ఆవిడ.. "దీన్ని నాన్ నెగోషియబుల్ ఫ్యామిలీ బాండింగ్ అంటారు. ఈ కొంచెం సేపన్నా కలవకపోతే కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు అంతరించుకుపోతాయి"అని ఉపదేశం చేసింది.
అలా సండే లంచ్ బాండింగ్ - అంటే ఆదివార భోజనానురాగబంధం అలవాటైపోయి , ఈ రోజెవరూ లేకపోయేసరికి వెలితిగా అనిపించిందన్నమాట. "ఆ... నీ కటింగులు, ఓవరాక్షన్లు మాకు తెలియనివా పితృదేవా, అమ్మ లేకపోతే చాన్స్ పే డ్యాన్స్ ఫక్కీలో తెగ రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తావుగా, ఈ వెలితి, గుబులు అని హరికథలు ఎందుకు" అని నా పిల్లలిద్దరూ మూకుమ్మడిగా అరుస్తున్నట్టు ఓ చిన్న ఫీలింగ్ అంతరాంతరాలలో. కాని నిజంగా సత్తెప్రమాణంగా మా లేడీస్ లేకపోతే ఏం తోచి చావదు. ఇదేదో బహువచనంలా  ఉందేమిటి చెప్మా అని ఆశ్చర్యపడమాకండి. ఏకవచనమే గౌరవంతో కలిసినప్పుడు అలా బహువచనంలా మారుతుందన్నమాట.
మూడు ముళ్లు వేసి మూడు పదుల సంవత్సరాలైపోయాయి. ఫర్వాలేదు ఇంకా బాగానే ఉన్నాం. మా గురువుగారు కనపడ్డవాళ్లని "ఆర్ యూ హ్యాపీ ఆర్ మ్యారీడ్" అని అడుగుతుండేవారు. ఆయన ఉద్దేశ్యం అది కాని, ఇది కాని ఏదో ఒకటే సాధ్యమని. అలా పెళ్లి మీద బోలెడన్ని జోకులు, సూక్తులు.  ఆస్కార్ వైల్డ్ అయితే పెళ్లి సూక్తులతో ఓ చిన్నపాటు పుస్తకమే రాసేశాడు. ఆయన వైవాహిక జీవితం గురించి పెద్ద తెలీదనుకోండి. "అంటే మీ ఇద్దరూ పాలు నీళ్లలా, దాసరి ఎప్పుడో రాసినట్టు  - సైకిల్‌కి రెండూ చక్రాల్లా కలిసి, మెలిసి, సొలసి, అలసిపోయారా, అంత సీనుందని మీరంటే మేము నమ్మాలా" అని మీలోని భర్యలూ, భర్తలూ నన్ను నిలదీస్తున్నారని తెలుసు నాకు.
హిందీ సీరియల్స్‌లోలాగా "కర్వా చౌత్" ( ఏదో ఒక పండుగ ఉంటూంది. అదృష్టం అది తెలుగులో లేనట్టుంది) రోజు  మా ఆవిడ చందమామని చూసి, ఆ తర్వాత నా ముఖారవిందం కాంచడం లాంటి  పనులేవీ చేయదు. రోజూ ఉదయాన లేచి నా కాళ్లెక్కడున్నాయని వెతికి దణ్నం పెట్టుకుని, మంగళసూత్రాలు కళ్లకద్దుకోవడం కూడా చేయదు. పోనీ కనీసం ఏ ఏకాదశినాదో, ద్వాదశినాడో మొగుడి ఆరోగ్యం కోసం పస్తులన్నా  ఉంటుందా అంటే అదీ లేదు. మరి మీ ఇద్దరి దాంపత్యంలో ఏముందని ఇలా ఆదివారం దొరికింది కదాని  సాక్షిలో రాసేసి, మా పెళ్లాలకి లేక మా మొగుళ్లకి ఆత్మన్యూనతా భావాన్ని, అనురాగ రహిత యాంత్రిక దాంపత్య అభద్రతాభయాన్ని అంటగడుతున్నావ్ అని మళ్లీ మీరు ఆవేశపడుతున్నారని నాకు బాగా తెలుసు. వస్తున్నా, వస్తున్నా.. అసలు పాయింట్‌కే వస్తున్నా.  సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చిత్రీకరించే ఉత్తమ భారత నారీమణి చేసే పనులు ఏ ఒక్కటీ చేయకపోయినా, దాసరిగారి దృష్టిలో మా ఆవిడ సైకిల్ చక్రం కాలేకపోయినా, విశ్వనాధ్‌గారి సృష్టిలో - జయప్రద బొట్టు చెరిగిపోతుందని కమల్‌హాసన్ వానకి చెయ్యి అడ్డం పెట్టినట్టు నేను పెట్టకపోయినా, మేమిద్దరం ఆది దంపతులం కాకపోయినా... ఆనంద దంపతులం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తిట్టుకుని, కొట్టుకుని, సిగలు పట్టుకుని, ఏ రోజూ ప్రతీకార జ్వాలతో నిద్దరపోయినట్టు గుర్తులేదు నాకు. అది చాలు మేము ఆనందంగా ఉన్నామని నిరూపించడానికి.

అలా అని మేమిద్దరం ఒకే రుచి, ఒకే అభిరుచి ఉన్న రెండు శరీరాలు, ఒకటే ఆత్మ టైపు కాదు. అసలు ఆ మాటకొస్తే మా ఇద్దరి ఇష్టాలు, దృక్పధాలు ఎక్కడా కలవ్వు. బెడ్‌రూంలో ఫ్యాన్ స్పీడ్ దగ్గర్నుంచి మా విభేదాలు మొదలు. నాకు ఒకటో నంబరులా  మలయమారుతంలా కావాలి. ఆమెకి ఐదో నంబరులో చండ ప్రచండంగా కావాలి.  అమె తక్కువ మాట్లాడుతుంది. ఆ రెండూ మాటలు కూడా చించి, చించి, ఆలోచించి వాల్యూం వన్‌లో వదులుతుంది. మన  స్టైల్ వేరు. మనం ముందు మాట్లాడేస్తాం. అదీ వాల్యూం ఫైవ్‌లో. తరువాత అవసరమైతే ఆలోచిస్తాం. ఆమెకు సంవత్సరానికి ఖర్చయ్యే మాటలు మనం ఒక్కరోజులో  వాడేస్తాం. అందుకే తను ముద్దుగా నాకు 'వెర్బల్ డయేరియా - కాన్‌స్టిపేషన్ ఆఫ్ థాట్' అంటే ' ఆలోచనా మలబద్ధకం - మాటల విరేచనాలు' అనే రోగాన్ని అంటగట్టింది. అయినా ఇలాంటి చిన్న రోగాల గురించి మనం భయపడతామా? మాటలు మానేస్తామా?

ఆమెకి ఇద్దరికంటే ఎక్కువ ఉంటే గుంపు. మనకి కనీసం వందమందైనా ఉంటేనే ఇంపు.
ఆమెకు సినిమాలంటే కంపు. మనకి సినిమాలంటే సొంపు.
ఇంతకంటే ఎక్కువ రైమ్ లు వాడితే ఆమె నన్ను చంపు.

ఇన్ని భేదాలు, విభేదాలు ఉన్నా మేమిద్దరం హ్యాపీగా ఎలా ఉన్నామా? అని మా ఆనంద దాంపత్య రహస్యం మీరు కూదా తెలుసుకుని 'పచ్చని మన కాపురం పాలవెలుగై, మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలి" అని డ్యూయెట్   పాడుకోవడానికి రెడీ అయిపోతున్నారని తెలుసు నాకు. ఇంతకీ రహస్యం ఏమిటంటారు? ఏమీ లేదండి బాబూ.. అడ్జస్ట్ అయిపోవడమే.. గివ్ అండ్ టేక్. అంటే కొంచెం ఇష్టపడు - కొంచెం కష్టపడు. అప్పుడప్పుడూ కొంచెం నష్టపడు... అవసరమైనప్పుడు..
నేను ఎంత అడ్జస్ట్ అయ్యానో  తెలీదు కాని తను నాకోసం, నా ఆనందం కోసం బోల్డన్ని త్యాగాలు చేసింది. తనకి ఇష్టం లేకపోయినా, నా నిర్ణయాలకి తలొగ్గి ఈ పరుగులో నాకు తోడుగా నిలిచింది. పిల్లల పాలనా పోషణా తనే చూసుకుంది. తలకాయతో ఆలోచించి రేషనల్‌గా చేయాల్సిన పనుల స్థానంలో గుండెకాయతో స్పందించి ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయాల ఫలితాల ఆలజడి నన్ను ముంచేస్తున్నపుడు తన మనోనిబ్బరం ఓ గొడుగై నిలిచింది.
ఒకరినొకరు అర్ధం చేసుకుని ఒకింత సర్దుకుని, ఒకింత హత్తుకుని ప్రయాణం చేసే అలవాటు అంతరించిపోయింది. ఈ రోజుల్లో, బలవంతంగా వ్యక్తిత్వాన్ని చంపుకుని బానిస బతుకులు వెళ్లబుచ్చమని సలహా ఇవ్వడం లేదు నేను. ఆ మధ్య ఎవరో చెప్పారు. ఎంగేజ్‌మెంట్ పార్టీలో .. కాబోయే మొగుడు లేకిగా మూడు కోడిగుడ్లు ఒకేసారి వడ్డించుకున్నాడని, ఓ అమ్మాయి ' ఈ మొగుడు క్యాన్సిల్' అనేసి ఎగిరిపోయిందంట. మరీ అతిగా లేదూ!
గజల్ శ్రీనివాస్ పాట మనసును తడిమేస్తోంది. తడిపేస్తోంది. ఊరునించి తను ఇంకా రానే లేదు - గమనించావో లేదో ఓ మనసా దాంపత్యంలాంటి మైత్రి లేనే లేదు"

2 comments: