Social Icons

Pages

Monday 17 August 2015

చూసే కళ్లకు మనసుంటే





రాత్రి పదయింది.
ఆరుబయట గార్డెన్‌లో నా పడకకుర్చీలో ఒదిగిపోయాను. పైన పిండి వెన్నెల - చల్లటి గాలి.. చుట్టూ నిశ్శబ్దం. ప్రపంచమంతా  నిద్దరపోతోంది. మై ఔర్ మేరీ తన్‌హాయీ.. 'చాయాగీత్' మొదలైంది వివిధభారతిలో.
'ఏక్ తేరా సుందర్ ముఖ్‌డా - ఏక్ తేరా ప్యార్‌సే బరా దిల్ మిల్నా ముష్కిల్' - రఫీ గుండెల్లోంచి తీసి తేనెలో అద్ది, అది చాలదన్నట్లు మరింత ప్రేమపాకంలో ముంచి  - గోముగా ఒక్కో చరణం విసురుతున్నాడు - నాలాంటి రొమాంటిసిస్ట్‌ల కోసం.
రఫీ పాటలు ఆనందించడానికి హిందీ రానక్కర్లేదు. కానీ కొంచెం  హిందీ, కొంచెం ఉర్దూ అర్ధమై - ఆ పాటల్లో సాహిత్యం అర్ధమైతే - ఆ అనుభూతి అనిర్వచనీయం. మెడికల్ కాలేజీ రోజుల్నుంచీ రాత్రి 10 గంటలకు చాయాగీత్ వినడం అలవాటు. 'అబ్బా! నువ్వు అంత హిందీ, ఉర్దూ పండిట్‌వా?' అని అనుమానిస్తున్నరని తెలుసు నాకు. ఆ రోజుల్లో సంగీత మాధుర్యమే గ్రోలేవాడ్ని.. ఒక్క మాటక్కూడా అర్ధం తెలీకుండానే..తర్వాత తర్వాత - పూణేలో, డిల్లీలో బతకడం వల్ల కొన్ని హిందీ మాటలు, భవానీతో లవ్‌లో పడిపోయి ఆమె 'జబ్ చలీ ఠండీ హవా, తబ్ ఉఠీ కాలీ ఘటా తుం యాద్ ఆతీ హై' అని లెటర్ రాస్తే - అది అర్ధం కాక, గిరి అనే ఓ హిందీ గురువు దగ్గర అర్ధం చెప్పించుకుని, మరికొన్ని మాటలు 'ఉర్దూ గజల్స్ ట్రాన్స్‌లేటెడ్ ఇన్‌టు ఇంగ్లీష్' బుక్ కొనుక్కుని, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ బ్లాగ్‌ల పుణ్యమా అని - ఇంకా మరికొన్ని మాటలు నేర్చుకున్నాను. ఇపుడు రఫీ అలా అమృతధారని వదులుతుంటే - సంగీతం, సాహిత్యం రెండింటినీ మమేకం చేసుకుని - పూర్తి అనుభూతిని జుర్రుకుంటున్నాను.
ఇంట్లో ఉంటే రాత్రి పదయిందంటే చాలు -చెవులు, మనస్సు ఎటో వెళ్లిపోతాయి. మా ఆవిడ మామూలుగానే 8 గంటలకల్లా ఆవలింతలూ, 9 కల్లా అప్పగింతలు (గుడ్‌నైట్) పెట్టేస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యం మరీ బాగుండి పదింటిదాకా మేలుకున్నా - నన్ను డిస్టర్బ్ చేయకుండా నా మానాన నన్ను పాటలకి వదిలేస్తుంది. ఈ కొత్త ఇల్లు ఊరికి అంత దూరంగా కట్టుకున్నాడే ఈ పిచ్చివాడు అని నన్ను చాలామంది తేడామనిషి కింద లెక్కెట్టేశారు. కానీ ఇక్కడ రాత్రి పదింటికి - ఆ స్వచ్చమైన మలయమారుతం, ఆ నిశ్శబ్దం, చుట్టూ చెట్లూ, కొండలూ - నాలాంటి ప్రకృతి పిపాసిని ఎక్కడికో - ఎవరికీ అర్ధం కాని, కనపడని భావుకతా లోకాలకి తీసుకెళ్తాయని ఎవరికి తెలుసు?
చాయాగీత్ అరగంటే. పక్క స్టేషన్‌కి మారాను. 'ఆ పాత మధురాలు' అని పాత తెలుగు పాటలొస్తున్నాయి. 'జగమే మారినది మధురముగా ఈవేళ' అని ఘంటసాల స్వర గంగాప్రవాహం చుట్టుముట్టేసింది. ఆ సమయానికి, ఆ వెన్నెలకి, ఆ చల్లగాలికి - సరైన పాట కదా! 'జీవితమంతా చిత్రమైన పులకింత' అన్న చరణం గుండె లోతుల్ని స్పృశించి, పరవశింపజేసింది. నిజమే కదా.. ఎప్పుడూ 'అది లేదు - ఇది లేదు' అని ఏడుస్తూ ఈడుస్తుంటాం. దాని బదులు - మా మిత్రులన్నట్లు 'లైఫ్ ఈజ్ రొమాన్స్' అనుకుంటే ఎంత హాయి! నా మటుకు నేను  దేవుడికి ప్రతి నిమిషమూ థాంక్స్ చెప్తుంటాను.- చుట్టుపక్కన ఉన్న అందాల్ని ఆనందించే మనసిచ్చినందుకు.


తెలుగుపాట - కవి ఎవరో గుర్తులేదు - 'ఎటు చూసినా అందమే - ఎటు చూసినా ఆనందమే - చూసే కనులకు మనసుంటే - ఆ మనసుకు కూడా కళ్లుంటే' అలానే నాకు చిన్నవాటిలో గొప్ప అందం కనపడ్తుంది. ఉదాహరణకి - ఓ చలికాలం ఉదయం మా ఇంటి తోటలో రెల్లుగడ్డి అంచుల మీద ఓ చిన్నపిట్ట ఉయ్యాల ఊగడం - మనసులో ఎంత ఆనందాన్ని నింపిందో చెప్పలేను. ఆ బుజ్జిపిట్టకు ఎవ్వరు నేర్పారో - రెల్లుగడ్డి చివర్న కూచుంటుంది. దాని బరువుకి ఆ గడ్డిపరక కిందదాకా వంగిపోతుంది. ఇక నేలను తాకుతుందనగా పిట్ట తుర్రుమని ఎగిరిఫోతుంది. మళ్లీ రెల్లుగడ్డి నిటారుగా అవగానే పిట్టకథ మొదలు. అలా - ఎన్నిసార్లు ఉయ్యాల ఊగిందో. ఈసారెపుడైనా గమనించండి. ఆనందంతో మీ గుండె నిండకపోతే నన్నడగండి.
అలానే అక్వేరియంలో చేపల్ని చూస్తూ గంటలు గడిపేయగలను - హాస్పిటల్‌లో నా రూంలో కాసింత నిశితంగా చూస్తే - అర్ధమైపోతుంది. చేపల్లో కూడా మనుషుల మాదిరిగా రకరకాలని. కొన్ని బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ మూలనుంటాయి. కొన్ని - 'చైతన్యం మా సొత్తు' అని గ్రూప్ సాంగ్ పాడుతున్నట్లు చెంగు చెంగున ఎగురుతుంటాయి. కొన్ని చిలిపి చేపలు - వేరేవాళ్ల మూతిలో మూతి పెట్టి సరసాలాడుతుంటాయి. అందుకనే ఓ కవి అన్నాడు - 'ఎంతో రసికుడు దేవుడు' అని. ఇన్ని అందాల్ని, ఇన్ని రంగుల్ని - ఇన్ని సొగసుల్ని, ఇన్ని సోయగాల్ని ఇచ్చాడు. ఆనందించడం చాతకాకపొతే మన ఖర్మ. ఈ పిట్టలు, చేపలు కూడా అక్కర్లేదు డెందం నిండా ఆనందం నింపడానికి. ఓ చలికాలం పొగమంచు ఆవరించిన తరుణాన - సూర్యోదయం తిలకించండి చాలు.. అద్భుతం!
మా గురువుగారు సీతారామశాస్త్రిగారు రాసినట్లు - 'ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా/ చలి చెర అసలు ఎపుడు వదిలిందో /అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎపుడు ఎదురయిందో'..
కాబట్టి నేనేమంటున్నానంటే - అందాన్ని ఆస్వాదించాలన్నా, ఆనందాన్ని గ్రోలాలన్నా, కోట్లుండక్కర్లేదు, సూట్లుండక్కర్లేదు. అలానే స్విట్జర్లాండ్ వెళ్లనక్కర్లేదు. న్యూజిలాండ్ వెళ్లనక్కర్లేదు -ఓ పున్నమి వెన్నెల, ఓ పిల్లగాలి, ఓ పిట్టకథ, ఓ రఫీ పాట - చాలు చూసే కళ్లకు మనసుంటే..

0 comments:

Post a Comment