Social Icons

Pages

Showing posts with label మనసు చీటి (సాక్షి). Show all posts
Showing posts with label మనసు చీటి (సాక్షి). Show all posts

Monday, 17 August 2015

చూసే కళ్లకు మనసుంటే





రాత్రి పదయింది.
ఆరుబయట గార్డెన్‌లో నా పడకకుర్చీలో ఒదిగిపోయాను. పైన పిండి వెన్నెల - చల్లటి గాలి.. చుట్టూ నిశ్శబ్దం. ప్రపంచమంతా  నిద్దరపోతోంది. మై ఔర్ మేరీ తన్‌హాయీ.. 'చాయాగీత్' మొదలైంది వివిధభారతిలో.
'ఏక్ తేరా సుందర్ ముఖ్‌డా - ఏక్ తేరా ప్యార్‌సే బరా దిల్ మిల్నా ముష్కిల్' - రఫీ గుండెల్లోంచి తీసి తేనెలో అద్ది, అది చాలదన్నట్లు మరింత ప్రేమపాకంలో ముంచి  - గోముగా ఒక్కో చరణం విసురుతున్నాడు - నాలాంటి రొమాంటిసిస్ట్‌ల కోసం.
రఫీ పాటలు ఆనందించడానికి హిందీ రానక్కర్లేదు. కానీ కొంచెం  హిందీ, కొంచెం ఉర్దూ అర్ధమై - ఆ పాటల్లో సాహిత్యం అర్ధమైతే - ఆ అనుభూతి అనిర్వచనీయం. మెడికల్ కాలేజీ రోజుల్నుంచీ రాత్రి 10 గంటలకు చాయాగీత్ వినడం అలవాటు. 'అబ్బా! నువ్వు అంత హిందీ, ఉర్దూ పండిట్‌వా?' అని అనుమానిస్తున్నరని తెలుసు నాకు. ఆ రోజుల్లో సంగీత మాధుర్యమే గ్రోలేవాడ్ని.. ఒక్క మాటక్కూడా అర్ధం తెలీకుండానే..తర్వాత తర్వాత - పూణేలో, డిల్లీలో బతకడం వల్ల కొన్ని హిందీ మాటలు, భవానీతో లవ్‌లో పడిపోయి ఆమె 'జబ్ చలీ ఠండీ హవా, తబ్ ఉఠీ కాలీ ఘటా తుం యాద్ ఆతీ హై' అని లెటర్ రాస్తే - అది అర్ధం కాక, గిరి అనే ఓ హిందీ గురువు దగ్గర అర్ధం చెప్పించుకుని, మరికొన్ని మాటలు 'ఉర్దూ గజల్స్ ట్రాన్స్‌లేటెడ్ ఇన్‌టు ఇంగ్లీష్' బుక్ కొనుక్కుని, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ బ్లాగ్‌ల పుణ్యమా అని - ఇంకా మరికొన్ని మాటలు నేర్చుకున్నాను. ఇపుడు రఫీ అలా అమృతధారని వదులుతుంటే - సంగీతం, సాహిత్యం రెండింటినీ మమేకం చేసుకుని - పూర్తి అనుభూతిని జుర్రుకుంటున్నాను.
ఇంట్లో ఉంటే రాత్రి పదయిందంటే చాలు -చెవులు, మనస్సు ఎటో వెళ్లిపోతాయి. మా ఆవిడ మామూలుగానే 8 గంటలకల్లా ఆవలింతలూ, 9 కల్లా అప్పగింతలు (గుడ్‌నైట్) పెట్టేస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యం మరీ బాగుండి పదింటిదాకా మేలుకున్నా - నన్ను డిస్టర్బ్ చేయకుండా నా మానాన నన్ను పాటలకి వదిలేస్తుంది. ఈ కొత్త ఇల్లు ఊరికి అంత దూరంగా కట్టుకున్నాడే ఈ పిచ్చివాడు అని నన్ను చాలామంది తేడామనిషి కింద లెక్కెట్టేశారు. కానీ ఇక్కడ రాత్రి పదింటికి - ఆ స్వచ్చమైన మలయమారుతం, ఆ నిశ్శబ్దం, చుట్టూ చెట్లూ, కొండలూ - నాలాంటి ప్రకృతి పిపాసిని ఎక్కడికో - ఎవరికీ అర్ధం కాని, కనపడని భావుకతా లోకాలకి తీసుకెళ్తాయని ఎవరికి తెలుసు?
చాయాగీత్ అరగంటే. పక్క స్టేషన్‌కి మారాను. 'ఆ పాత మధురాలు' అని పాత తెలుగు పాటలొస్తున్నాయి. 'జగమే మారినది మధురముగా ఈవేళ' అని ఘంటసాల స్వర గంగాప్రవాహం చుట్టుముట్టేసింది. ఆ సమయానికి, ఆ వెన్నెలకి, ఆ చల్లగాలికి - సరైన పాట కదా! 'జీవితమంతా చిత్రమైన పులకింత' అన్న చరణం గుండె లోతుల్ని స్పృశించి, పరవశింపజేసింది. నిజమే కదా.. ఎప్పుడూ 'అది లేదు - ఇది లేదు' అని ఏడుస్తూ ఈడుస్తుంటాం. దాని బదులు - మా మిత్రులన్నట్లు 'లైఫ్ ఈజ్ రొమాన్స్' అనుకుంటే ఎంత హాయి! నా మటుకు నేను  దేవుడికి ప్రతి నిమిషమూ థాంక్స్ చెప్తుంటాను.- చుట్టుపక్కన ఉన్న అందాల్ని ఆనందించే మనసిచ్చినందుకు.


తెలుగుపాట - కవి ఎవరో గుర్తులేదు - 'ఎటు చూసినా అందమే - ఎటు చూసినా ఆనందమే - చూసే కనులకు మనసుంటే - ఆ మనసుకు కూడా కళ్లుంటే' అలానే నాకు చిన్నవాటిలో గొప్ప అందం కనపడ్తుంది. ఉదాహరణకి - ఓ చలికాలం ఉదయం మా ఇంటి తోటలో రెల్లుగడ్డి అంచుల మీద ఓ చిన్నపిట్ట ఉయ్యాల ఊగడం - మనసులో ఎంత ఆనందాన్ని నింపిందో చెప్పలేను. ఆ బుజ్జిపిట్టకు ఎవ్వరు నేర్పారో - రెల్లుగడ్డి చివర్న కూచుంటుంది. దాని బరువుకి ఆ గడ్డిపరక కిందదాకా వంగిపోతుంది. ఇక నేలను తాకుతుందనగా పిట్ట తుర్రుమని ఎగిరిఫోతుంది. మళ్లీ రెల్లుగడ్డి నిటారుగా అవగానే పిట్టకథ మొదలు. అలా - ఎన్నిసార్లు ఉయ్యాల ఊగిందో. ఈసారెపుడైనా గమనించండి. ఆనందంతో మీ గుండె నిండకపోతే నన్నడగండి.
అలానే అక్వేరియంలో చేపల్ని చూస్తూ గంటలు గడిపేయగలను - హాస్పిటల్‌లో నా రూంలో కాసింత నిశితంగా చూస్తే - అర్ధమైపోతుంది. చేపల్లో కూడా మనుషుల మాదిరిగా రకరకాలని. కొన్ని బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ మూలనుంటాయి. కొన్ని - 'చైతన్యం మా సొత్తు' అని గ్రూప్ సాంగ్ పాడుతున్నట్లు చెంగు చెంగున ఎగురుతుంటాయి. కొన్ని చిలిపి చేపలు - వేరేవాళ్ల మూతిలో మూతి పెట్టి సరసాలాడుతుంటాయి. అందుకనే ఓ కవి అన్నాడు - 'ఎంతో రసికుడు దేవుడు' అని. ఇన్ని అందాల్ని, ఇన్ని రంగుల్ని - ఇన్ని సొగసుల్ని, ఇన్ని సోయగాల్ని ఇచ్చాడు. ఆనందించడం చాతకాకపొతే మన ఖర్మ. ఈ పిట్టలు, చేపలు కూడా అక్కర్లేదు డెందం నిండా ఆనందం నింపడానికి. ఓ చలికాలం పొగమంచు ఆవరించిన తరుణాన - సూర్యోదయం తిలకించండి చాలు.. అద్భుతం!
మా గురువుగారు సీతారామశాస్త్రిగారు రాసినట్లు - 'ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా/ చలి చెర అసలు ఎపుడు వదిలిందో /అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎపుడు ఎదురయిందో'..
కాబట్టి నేనేమంటున్నానంటే - అందాన్ని ఆస్వాదించాలన్నా, ఆనందాన్ని గ్రోలాలన్నా, కోట్లుండక్కర్లేదు, సూట్లుండక్కర్లేదు. అలానే స్విట్జర్లాండ్ వెళ్లనక్కర్లేదు. న్యూజిలాండ్ వెళ్లనక్కర్లేదు -ఓ పున్నమి వెన్నెల, ఓ పిల్లగాలి, ఓ పిట్టకథ, ఓ రఫీ పాట - చాలు చూసే కళ్లకు మనసుంటే..

Saturday, 15 August 2015

అమ్మ చేతిలో చెయ్యేసి







అమ్మకి ఆరోగ్యం బాగోక ఆరునెలలు అయింది. కొద్దిపాటి విరేచనలతో మొదలైన అనారోగ్యం, అన్నిరకాల కాంప్లికేషన్స్ నీ పోగేసుకుని, చివరకు స్ట్రోక్‌గా(పక్షవాతం) అవతరించి, అమ్మని వీల్ చెయిర్‌కి పరిమితం చేసేసింది. అంతకుముందు నాకూ, ఆమెకీ ఎప్పుడూ ఒకటే యుద్ధం. నా దగ్గరే ఉండిపొమ్మని నేనూ - "నాకిక్కడ తోచదు. గుంటూరులో ఉంటాను" అని ఆమె - బోల్డన్నిసార్లు మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. కానీ ఈ రకంగా నా దగ్గర ఉండిపోతుందని అనుకోలేదు.

రోజూ అమ్మతో కాసేపు గడుపుదామని ప్రయత్నిస్తుంటాను. అన్ని రోజులూ కుదరదు. ఉదయం  హాస్పిటల్‌కి వెళ్ళే టైంకి నిద్రలో ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి లేట్ అయితే మళ్లీ దొరకదు తనతో సాంగత్యం. దగరకు వెళ్లగానే నా గడ్డం పట్టుకుంటుంది. చేయి వదలదు. "ఆరోగ్యం చూసుకో నాన్నా" అని పదిసార్లు గుర్తు చేస్తుంది. అది కొద్దిసేపే - తర్వాత తన లోకంలోకి వెళ్లిపోతుంది. "రేపు గుంటూరు వెళ్లిపోతాను నాన్నా" అంటుంది ఒక్కోసారి. తనకి ఏమయిందో - ఎందుకు నడవలేకపోతోందో - ఎక్కడ ఉందో తనకు పూర్తిగా అవగాహన లేదు. మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల, కొంత భాగం పనిచేయక - ఈ రకమైన అనిశ్చిత పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ఓ రకంగా దేముడు ఆమెకి ఇచ్చిన వరమేమో ఇది. అనారోగ్యంతో చేయి, కాలు కదలకపోవడం, తనంతట తాను టాయ్‌లెట్‌కి వెళ్లలేకపోవడం ఎంత దుర్భరమో.. ఆ అశక్తత మనసుకు తెలియకపోవడం అంతకంటే మించిన వరమే అనిపిస్తుంది.

వరప్రసాదరెడ్డిగారు తన ప్రతి పుట్టినరోజుని, మాతృదినోత్సవంగా జరుపుతారు. ఆ రోజు కొందరు తల్లులను గౌరవిస్తారు. పోయిన సంవత్సరం చిరంజీవిగారి అమ్మ, ఎస్పీబాలుగారి అమ్మ, తనికెళ్ల భరణిగారి అమ్మలతోపాటు, మా అమ్మకి కూడా ఆ గౌరవం దక్కింది. కానీ దురదృష్టం, ఆ రోజుకి వారం ముందే అమ్మకి పక్షవాతం వచ్చి హాస్పిటల్‌లో ఉండిపోయింది. అమ్మ తరఫున నాన్న ఆ సత్కారం అందుకున్నారు. ఆ సందర్భంలొ నేను మాట్లాడ ప్రయత్నించి విఫలమయ్యి, అందరిముందూ ఏడ్చేశాను. గుండెలోతుల్లో కూరుకున్న, పేరుకున్న అనుభూతులన్నీ పెల్లుబికి కన్నీళ్ల రూపంలో రావడం ఓ అనిర్వచనీయమైన ప్రక్రియ.


ఈరోజు నేను డాక్టర్నయ్యి ఇంతమందికి సాయం చేయగల్గుతున్నానంటే - అది అమ్మ చలవే. ఆమెకి నేను డాక్టర్ కావాలని ప్రగాఢమైన కోరిక. ఆమె ప్రోద్భలం లేకపోతే పట్టు వదలని విక్రమార్కుడిలా అన్నిసార్లు  ప్రయత్నించగలిగి ఉండేవాడ్ని కాదేమో. కానీ దేవుడి లీల - పక్షవాతం పర్మినెంట్‌గా ఆమెని వీల్ చెయిర్‌కి పరిమితం చేయడం  - మా డాక్టర్లందరం నిమిత్తమాత్రులుగా మిగిలిపోవడం దురదృష్టం కాక మరేమిటి! కాకపోతే ఆమెకి ఈ రకంగానైనా కొంత సేవ చేయగలగడం అదృష్టం.

అయిదేళ్ల క్రితం నేను తెచ్చిన 'గురవాయణం' పుస్తకంలో 'మాతృదేవోభవ' అని అమ్మ గురించి రాశాను. దాంట్లో నామిని రాసిన 'అమ్మకి జేజే' పుస్తకం గురించి ప్రస్తావించాను. ఈసారి చీకోలు సుందరయ్యగారి సంపాదకత్వంలో వచ్చిన 'అమ్మ' కవితా సంకలనం గురించి చెప్పడం సముచితం. మూడేళ్ల క్రితం మృణాళిని దగ్గర ఈ పుస్తకం చూశాను. వాకబు చేస్తే  అదే చివరి కాపీ అని తెల్సింది. "ఈ పుస్తకం నేను అచ్చేసిస్తాను అవకాశం వస్తే అనుకున్నాను. ఆ అవకాశం ఇన్నాళ్టికి సుందరయ్యగారి ద్వారా వచ్చింది.

వందమందికి పైగా కవులు అమ్మ గురించి వివిధ కోణాలని స్పృశిస్తూ పండించిన కవితల సంకలనం ఇది. సుందరయ్యగారన్నట్లు - మన పూర్వీకులు మాతృదేవోభవ అని తొలి నమస్కారం అమ్మకే కేటాయించారు. తొలిస్థానం ఆమెకే ఇచ్చారు. సినీకవులు సైతం 'అమ్మంటే అంతులేని సొమ్మురా - అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా' అని అందంగా చెప్పారు. విమలగారు 'వంటిల్లు' పేరున అమ్మ గురించి , అమ్మ వంటల గురించి ఆర్ద్రంగా రాశారు.

'ఎంత అద్భుతమైందీ వంటగది

రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ

తెరచిన తినుబండారాల దుకాణంలా

ఎంత నోరూరిస్తుందో

తాలింపు ఘుమఘుమాయింపులతో

పూజామందిరం అగరొత్తుల సువాసనల్తో

మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది' అని.

ఈ కవిత చదువుతూనే చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి జారిపోయాను. పారిపోయాను. అమ్మ రవ్వలడ్లు, కొబ్బరి లౌజులు చేసేది. శనివారం ఎప్పుడు వస్తుందా అని చూసేవాన్ని. ఎందుకంటే - ఆ రోజు దేవుడికి నాన్న కొట్టిన కొబ్బరికాయ - మాకు రవ్వలడ్డుగా అమ్మ చేతుల్లో ప్రత్యక్షం. అమ్మ చేసిన టొమాటో పప్పు అద్భుతహ. అలానే గుత్తివంకాయ కూర ఆమె చేతుల్లో అమృత ధార. మజ్జిగచారు గురించి చెప్పనక్కర్లేదు. కానీ నా దురదృష్టం. ఇప్పుడు అమ్మ ఏ వంటా చేయలేని పరిస్థితి. మా వంటామె చేసిన వంటకాల్ని అమ్మకి తినిపిస్తూ, "అమ్మా! నువ్వు చేసిన పప్పు ఇంతకంటే ఎంత బాగుండేదో" అని అంటుంటే - ఆ అలసిపోయిన మొహంలో కొసమెరుపుగా మళ్లీ ఓ చిరునవ్వు మొలుస్తుంది. అదే చాలు నాకు.

నేను మెడికల్ కాలేజీలో చేరేదాకా - అమ్మే తల దువ్వేది నాకు. దువ్వెన ఆమె చేతికిచ్చి తలవంచుకుని నిలబడితే .. ప్రేమగా, గోముగా ఓ చేత్తో గడ్డం పట్టుకుని ఇంకో చేత్తో పాపిట తీసి తలదువ్వడం నా గుండెల్లో పదిలంగా దాచుకున్న అనుభూతి. ఆప్యాయత ఎక్కడ కనపడ్డా - ఎవరు పంచినా అమ్మే గుర్తొస్తుంది నాకు. నా ఆరోగ్యం గురించీ, నా కెరీర్ గురించి, అనుక్షణం ఆలోచిస్తూ ఆరాటపడే స్నేహితురాలిలో కనపడుతుంది అమ్మ నాకు. సమస్యలలో సతమతమయ్యే సమయాన ధైర్యాన్నిచ్చి చేయూతనిచ్చే భార్యలో కనపడుతుంది అమ్మ నాకు. హాస్పిటల్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు, నాకోసం ఎదురు చూసి, భోజనం పెట్టే కూతురిలో కనపడుతుంది అమ్మ నాకు. చూడగలిగితే  - ఎటు చూసిన అమ్మే..

అమ్మ గుంటూరులో ఉన్నన్నాళ్లూ ఆమెతో గడపటానికి సమయం దొరికేది కాదు. జీవితంలో స్థిరపడ్డానికి బోల్డన్ని యుద్ధాలు, పరుగు పందేలు! ఇప్పుడు అమ్మతో గడిపే సమయం, సందర్భం వచ్చినా అమ్మ లేదు. శారీరకంగా నా ముందే ఉన్నా, నాకందని లోకాల్లోకి వెళ్లిపోయింది. కొడుకు చేతిలో చెయ్యేసి, మాట్లాడ ప్రయత్నిస్తూనే మనకెవరికీ అర్ధం కాని శూన్యంలోకి జారిపోయింది.

'అమ్మ బాగున్నప్పుడు ఇంకొంచెంసేపు గడిపి ఉంటే ఎంత బాగుండేదో కదా" అని ఎన్ని వదలసార్లు అనుకుని నాలో నేను ఏడ్చుకుంటున్నానో, నాలాగే కొన్ని కోట్లమంది కొడుకులు అమ్మలతో గడపక, గడపలేక కుమిలిపోతూ ఉండి ఉంటారు. వాళ్లందరికీ నా విన్నపం ఒకటే. అమ్మతో గడపటానికి వచ్చిన ప్రతీ అవకాశాన్నీ రెండు చేతుల్తో అందుకోండి. అమ్మ మాటలు చాదస్తంగా, చాందసంగా అనిపించినా పట్టించుకోవద్దు. చిన్నప్పుడు మీకు రవ్వలడ్దు పెట్టిన అమ్మని, పెద్దయినాక తల దువ్విన అమ్మని గుర్తు తెచ్చుకోండి. మాటలు చేతకాకపోతే  చేతిలో చెయ్యేసి అలానే కూచోండి. ఆ స్పర్శలో , ఆ నిశ్శబ్దంలో అవధి లేని అనురాగ గ్రంధాలు ఆవిష్కృతమవుతాయి.

డా.గురవారెడ్డి