Social Icons

Pages

Tuesday 17 September 2013

వినాయక చవితి జ్ఞాపకాలు




అవిఘ్నమస్తు

చిన్నప్పుడు మా నాన్న "పండగ కాదు దండగ" అంటుంటేవాడు. నిజమే  మధ్యతరగతి కుటుంబానికి, సంవత్సరానికి కనీసం పది పండగల ఖర్చు వేసుకున్నా negative budgetలోకి వెళ్లడం ఖాయం కానీ పిల్లలకి మటుకు నిజంగా పండగే. నా చిన్నవనంలో అన్నీ పండుగలు మొహమాటం లేకుండా celebrate చేసుకునేవాడ్ని.
ప్రస్తుతం వినాయక చవితి కాబట్టి కాసేపు ఆ కబుర్లు చెప్పుకుందాం. నా బాల్యం అంతా బాపట్లలోనే. నన్నడిగితే enjoy చేయడానికి సరైన place.. మరీ పల్లెటూరు కాదు పెద్ద నగరమూ కాదు. చిన్న పట్టణం. రెండు సిన్మా హల్స ఉండేవి. చిత్రకళామందిరం, దుర్గ కళామందిరం అని.. ఒకటి వినపడదు - ఒకటి కనపడదు అని జోక్స్ వేసుకునేవాళ్లం. బాపట్లలో మేం మాయాబజార్‌లో ఉండేవాళ్లం. అక్కడ దొంగలు ఎక్కువని. కాసేపు ఏమరుపాటయితే వస్తువులు మాయమవుతాయని నానుడి. వస్తువుల సంగతి  ఏమోకాని.. అమ్మ కాస్త అటు తిరగ్గానే మేం మాయమయేవాళ్లం.
వినాయక చవితిరోజు మొత్తం మాంచి సరదాగా, బిజీగా ఉండేది. ఉదయం అభ్యంగ స్నానం తప్పనిసరి. ఆ రోజుల్లో ఈ షాంపూలు అందుబాటులో లేవు. atleast మా ఇంట్లో. కుంకుడురసం - అది కళ్లలోకి పోవడం తథ్యం. కళ్ళు మండడం అనివార్యం. మా అమ్మ చెప్పేది. "కళ్లకి మంచిది నాన్నా! " అని. కళ్ళు మండటంతో  మొదలయేది రోజు. ఆ కష్టాలు అప్పుడే అవ్వలేదు. ముందస్తుగా అమ్మ కష్టపెట్టేది. తర్వాత నాన్న వంతు. పూజ అయ్యేదాకా No Food.  ఆ పూజేమో తెలుగు టీవీ సీరియల్‌లాగా సాగుతూ, సాగుతూ ఓ రెండు గంటలు పట్టేది. మా ధ్యాసంతా పానకం, ఉండ్రాళ్ళు, గారెలమీదే. ఎలాగో కష్టపడి, పూజ విన్నాం అనిపించేవాళ్లం. (ఇపుడు ఆ పూజా కార్యక్రమం నా మీద పడిందనుకోండి... అది వేరే సంగతి) ఫుల్లుగా  పిండివంటల్ని లాగించి ఊరి మీద పడేవాళ్లం. అపుడే మొదలయ్యేది అసలు ఆనందం.
మరి ఏ పురాణాల్లో చెప్పారో లేక బాపట్ల చరిత్రలో రాశారో.. ఆ రోజుల్లో " వినాయకచవితి రోజు తిట్లు దీవెనలుగా మారతాయని". సో మాకు ఆ రోజు గారెలతో పాటు తిట్లు కూడా వినడం ప్రధమకర్తవ్యంగా ఉండేది. తిట్లు ఊరికే రావు కదా. సంపాదించాలి. అందుకోసం ఓ బృహత్పధకం వేసేవాళ్లం. కాసరగడ్డలు, పల్లేరు కాయలు సంపాదించడం అన్నమాట. కాసరగడ్డలు అంటే మన ఉల్లిపాయల్లా ఉండేవి. ఊరిబయట, తోపుల్లో దొరికేవి. కాసరగడ్డలు  రోడ్డుమీద పోయే బాటసారుల మీద విసరడం ... వాళ్లు తిట్టడం మొదలెట్టగానే పరుగు లంకించుకోవడం .. అలానే పల్లేరుకాయలు రోడ్డుమీద, చిన్న చిన్న కిరాణా కొట్ల ముందు వేయడం. జనం వాటిని తొక్కి బాధపడుతుంటే మేం నవ్వడం.. అది చూసి వాళ్లు తిట్టడం.. మళ్లీ పరుగు లంగించుకోవడం.. చూశారా.. తిట్లు తినడానికి ఎని కష్టాలు, ఎంత శ్రమ పడేవాళ్లమో!!!
మొత్తం మీద చాతనయినంత తిట్లు సంపాదించుకుని భోజనం టైంకి ఇంటికి చేరేవాళ్లం. అదృష్టం బాగోలేక మాకు దీవెనలిచ్చిన బాటసారులెవరైనా వెంటబడి ఇంటికి వచ్చారనుకోండి. అప్పుడు అమ్మకంటే ముందు నాన్న వడ్డించేవారు. భోజనం మాత్రం అద్భుతం. గారెలు, బూరెలు, పులిహోర, పాయసం. కమ్మగా లాగించి బ్రేవుమని తేన్చి రేడియో ముందు చేరేవాళ్లం. మధ్యాన్నం మూడింటికి "సంక్షిప్త శబ్దచిత్రం" అని వచ్చేది రేడియోలో. ఇంటిల్లిపాది అక్కడే. బొమ్మలు చూడకుండా డైలాగులలో సిన్మా మొత్తం ఊహించుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి.
సాయంత్రం మళ్లీ రోడ్ల మీదకి. ఈసారి తిట్ల కోసం కాదులెండి ఆడుకోవడానికి. ఓ జేబులో వేయించిన వేరుసెనక్కాయలు. ఇంకో జేబులో బెల్లం గడ్డ. పండగ స్పెషల్ కదా.. అప్పుడే రెండు రవ్వలడ్లు కూడా దొరికేవి. కుందుళ్ళు, కబడి. పిచ్చి బంతి, కొంచెం పెద్దయినాక బాడ్మింటన్. ఎవడన్నా సైకిల్ తెస్తే ఇక దాని మీద పడి విధ్వంసం చేసేదాకా వదిలేవాళ్లం కాదు.
ఇక క్రికెట్ మా లెవల్ కాదు. అది ఆ రోజుల్లో కాలేజీ గేమ్. ఒక్కోసారి నాన్న మూడ్ బావుంటే రాత్రి సినిమా చాన్స్ దొరికేది. అదే చిత్రకళామందిరంలోనో - దుర్గకళామందిరంలోనో.
వినాయకచవితి అంత హాయిగా గడిచిపోయేది. ఉదయాన ఆందరం మా పుస్తకాలన్నీ దేవుడి దగ్గర పెడితే నాన్న వాటికి పసుపు, కుంకుమ పెట్టేవాడు. నాకయితే  ఆ బొట్లు ఎంత పెద్దగా పెడితే అన్ని మార్కులు చదవకుండా వస్తాయనే నమ్మకం ఉండేది.
హైదరాబాదు వచ్చిన తర్వాత వినాయక్ చవితి perspective మారిపోయింది. పెద్ద పెద్ద పందిళ్లు, విగ్రహాలు, నిమజ్జనం, కోలాహలం. వినాయకుడిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్లాయి. పది ఏళ్ళనుంచి ప్రయత్నిస్తున్నాను ఒక్కసారన్నా నిమజ్జనం కోలాహలం experience చేద్దామని. కుదరడం లేదు. ఉదయాన పూజ మట్టుకు చాలా Sincereగా చేస్తున్నానండోయ్.

మీ అందరి కోరికలు, ఏ విఘ్నాలు లేకుండా తీరాలని ఆ వినాయకుడిని ప్రార్ధిస్తూ సెలవు.
                                                                                                    
                                                                                                               మీ గురవారెడ్డి.


ఇంకో మాట చెప్పాలి. గత బుధవారం తరంగ రేడియోలో వినాయక చవితిగురించి మరిన్ని కబుర్లు చెప్పాను. వినేయండి. ఓ పనైపోతుంది.


 

1 comments:

  1. సర్ అప్పుడు కాళ్ళకింద పల్లేరు కాయలేసి నొప్పి తెప్పించారు
    ఇప్పుడు కాళ్ళనొప్పులు బాగుచేసి నయం చేస్తున్నారు .

    ReplyDelete