నేను చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసేసరికి రెండే రెండు పార్టీలు ఉండేవి. మీరు కాంగ్రెస్ - కమ్యూనిస్టు పార్టీ అనుకుంటే కాలే పప్పులో కాలేసినట్లే.
ఎన్.టి.ఆర్.పార్టీ - ఎ.ఎన్.ఆర్ పార్టీలు అవి. నేను లాగుల్లో ఉన్నప్పుడు
ఎన్.టి.ఆర్ పార్టీ. మా అమ్మమ్మ వాళ్లూర్లో, డేరా టాకీస్‌లో నేలలో కూచుని సిన్మా చూస్తూ, ఎన్.టి.ఆర్. కత్తి తిప్పుతుంటే గుర్రం తోలుతుణ్టే ఆయనతోపాటు నేను
కూడా ఎక్కడికో వెళ్ళిపోయేవాడ్ని. ఆ తర్వాత లాగుల్లోంచి పాంటుల్లోకి ఎదిగినపుడు
నూనూగు మీసాలొచ్చినప్పుడు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించేసి
ఎ.ఎన్.ఆర్ పార్టీలోకి జంప్ అయిపోయాను.
కారణం అబ్బే.. ఏం లేదు. పిల్ల వేషాల
నుంచి 'పిల్ల' కోసం రొమాంటిక్ వేషాలు వేసే స్టేజ్‌కి నా మనసు, శరీరం ప్రమోట్ అయిపోవడమే! కత్తి తిప్పుతూ - ఒక్క కాలు మీద గెంతుతూ
(అది కూడా స్కిన్ టైట్ ప్యాంట్స్‌లో) - "వగలరాణివి నీవే..." అని పాడితే - ఆడపిల్లలు ఇంప్రెస్ అవ్వరని,
స్టైల్‌గా సిల్క్ షర్ట్‌లో పియానో ముందు కూచుని
" నా హృదయంలో నిదురించే చెలీ..." అని అరమోడ్పు కన్నులతో పాడితే
అతివలందరూ అతి చేరువవుతారనీ ఓ లవ్ గురు
చెప్పడం వల్ల ఎ.ఎన్.ఆర్ పార్టీలో చేరిపోయాను.
అక్కడినుంచి ఎ.ఎన్.ఆర్ నన్ను వదిలిపెడితే
ఒట్టు. అసలు నన్నడిగితే, 60, 70ల్లో లవ్‌లో పడ్డ ప్రతి కుర్రాడూ
తెలుగునాట ఎ.ఎన్.ఆర్ వల్లే ఇన్‌స్పైర్ అయి ఉంటాడని నా గట్టి నమ్మకం. నా నడకా,
మాటా , నవ్వూ, చూపు అన్నీ ఎ.ఎన్.ఆర్ లాగా ఫీల్ అయ్యేవాడ్ని. చివరికి, ఏ అమ్మాయిని చూసినా ఎడమ చెయ్యి షర్ట్ కాలర్ దగ్గరికి, కుడిచేయి గాలిలోకి అప్రయత్నంగా వెళ్లిపోతాయి. కాకపోతే సావిత్రి దగ్గర
మొదలయిన రొమాన్స్ కాంచనని, వాణిశ్రీని తట్టుకొని భవానీ దగ్గర
ఫలించేందుకు పదేళ్లు పట్టిందనుకోండి. అది వేరే సంగతి.
అసలా మాటకొస్తే - ఒక్క రొమాన్సే కాదు,
నా కెరీర్ కూడా ఎ.ఎన్.ఆర్ ప్రభావితమే.
ఎన్.టి.ఆర్ ఫాన్‌గా ఉన్నప్పుడు - నేను పెద్దయ్యాక కత్తుల షాప్ పెట్టుకుని గుర్రాల
ట్రైనర్‌ని అవుదామనుకున్నాను. అలాంటిది - ఆరాధన, డాక్టర్ చక్రవర్తి సిన్మాలు చూసి, అర్జంట్‌గా డాక్టరయిపోదామని డిసైడ్ అయ్యాను.
ఈ రకంగా, ఎ.ఎన్.ఆర్ నా లైఫ్‌లో తన పరిచయానికి ముందే నా జీవితాన్ని ఇన్‌ఫ్ల్యూయన్స్
చేశారు.
1995లో నా కుమార్తె కావ్య యాక్ట్ చేసిన
గుఱ్ఱం గంగరాజు డైరెక్ట్ చేసిన "లిటిల్ సోల్జర్స్"ని సమర్పించిన
అక్కినేని వెంకట్ ద్వారా నాకు మొదటిగా ఎ.ఎన్.ఆర్‌గారితో పరిచయం అయింది. నేను
రాణిగారిని వదిలేసి ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వచ్చి, హైదరాబాద్‌లో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది.
అన్నపూర్ణమ్మగారి మోకాలు ఆపరేషన్లలో నేను కూడా భాగస్వామినవ్వడం వల్ల మా స్నేహం
అనుబంధంగా మారింది. ఇప్పుడు అక్కినేని కుటుంబ సభ్యులందరితో నా రిలేషన్ 'గురవారెడ్డిగారు' నుంచి 'గురివి'కి ఎదిగింది.. ఒదిగింది.
నాగేశ్వర్రావ్ గారి జీవితం, ఆయనధిగమించిన నటనా శిఖరాలు
అందరికీ తెలిసినవే. వాటి గురించి నేను స్పెషల్‌గా రాసేదేమీ లేదు.
వ్యక్తిగతంగా నాకు తెలిసిన, నేను ఇన్‌స్పైర్ అయిన కొన్ని విషయాలు
చెప్తాను.
నాగేశ్వర్రావ్‌గారి డిసిప్లిన్ చూస్తే నాకు
టెన్షన్ వచ్చేస్తుంది. ఉదయం 6 గంటలకి ఎండయినా, వానయినా వాకింగ్ చేయాల్సిందే..(అదీ, అపుడే ఇస్త్రీ చేసినట్టు అగుపడే తెల్లని డ్రెస్‌లో). మనలాంటి
అల్పజీవులం రేపుదయం వాకింగ్ ఎలా ఎగ్గొట్టాలా? అని ఈ రోజంతా ప్లాన్ వేస్తుంటాం. అలానే, ఎవరు డిన్నర్‌కి పిలిచినా టంచన్‌గా వస్తారు. 9 గంటలకి ఇంటికి వెళ్లిపోవాల్సిందే. మన హైదరాబాదులో ఒక్కోసారి 9 దాకా హోస్ట్ కూడా రాడు. భోజనాల సంగతి సరేసరి. కొన్నిసార్లు 10 దాకా ఫుడ్ సర్వ్ చేయరు. ఎ.ఎన్.ఆర్ గారి సమయపాలనా నిబద్ధత
తెలుసుకున్న హోస్ట్స్ అందరూ ఆయన ఒక్కరి కోసమన్నా ఆ టైంకి భోజనం ఏర్పాటు చేసి
"అమ్మయ్యా" అనుకుంటారు.
రెండో విషయం -- అంత పెద్ద సెలబ్రిటీ
ఫామిలీలో తన పెద్దరికాన్ని హాండిల్ చేసే వైనం.. అద్భుతం.
మామూలుగా మనందరం ఊహించుకునేది -
పెదరాయుడి టైప్‌లో కుటుంబాన్నంతా వేలిమీద ఆడిస్తూ చండశాసనుడిలాగా పాలిస్తూ
ఉంటారని. కానీ నిజం ఏమిటంటే - అందరితో .. మనవళ్లతో సహా స్నేహితుడిలాగా ఉంటారు.
అడిగితేనే సలహాలిస్తారు. ఫ్యామిలీ సభ్యులంతా ఆయనకిచ్చే గౌరవం అపురూపం. ప్రతి
ఆదివారం లంచ్ నాగేశ్వర్రావ్‌గారింట్లో. కుటుంబమంతా కలుస్తారు. పని మీద - ఊళ్ళో
లేకపోతే తప్ప. ఈ సంగమం - ఆయన ఫ్యామిలీ వాల్యూస్‌కి ఇచ్చే రెస్పెక్ట్‌కి నిదర్శనం.
సరే, వ్యక్తిత్వం, అలవాట్లు, క్రమశిక్షణ మనం ఎలాగోలా కష్టపడో, ఇష్టపడో ఏర్పరుచుకుంటాం. అంటే ఒక రకంగా ఇవన్నీ మనసుకు సంబంధించిన
నియంత్రణలు. అదే రకంగా శరీరాన్ని లోనున్న ఫిజియాలజిని మనం నియంత్రించడం కష్టమైన
విషయం. 'ఓ డయాలసిస్ - నా దరికి రాకు' అంటే వింటుందా? , 'ఏయ్ హార్డ్
ఎటాక్ - నా జోలికి రాబోకు' అంటే ఆగుతుందా?, 'ఓ మోకాళ్ళూ - అరగమాకండి కరగమాకండి' అంటే ఊర్కుంటాయా? .. కాని అదేం విచిత్రమో - నాగేశ్వర్రావ్‌గారు
బాడీ కూడా ఆయన చెప్పు చేతల్లోనే ఉంటుంది.
ఇరవై ఏళ్ళ క్రింద అమెరికాలో "ఈయన
గుండెని రిపేర్ చెయడం మావల్ల కాదు" అని ఆపరేషన్ థియేటర్‌లోంచి బయటకు
పంపేశారు. ఈ రోజుకీ ఆయన్ హార్ట్ పర్‌ఫెక్ట్. ఆ డాక్టర్లందరూ ముక్కున వేలేసుకుని,
నోట్లో కాలేసుకుని, ఇప్పుడు ఎ.ఎన్.ఆర్ గారి మీద డాక్యుమెంటరీ చేస్తున్నారు - 'లాంగెస్ట్ సర్వైవ్డ్ పేషంట్ ఫ్రం దెయిర్ ఇనిస్టిట్యూట్' అని.
ఆయన నిల్చోవడం, నడవడం ఎప్పుడన్నా చూశారా? ఓ అంగుళం కూడా
వంగరు. నిటారుగా మేరు నగ పర్వతంలాగ. ఆయనలో సగం వయసున్నవాళ్లు కూడా వంగి, వంగిపోయి మెడ నొప్పో, నడుం నొప్పో అంటూ మూలుగుతుంటారు.
అక్కినేనిగారితో నా పరిచయం నా అదృష్టం.
ఆయన గురించి ఓ నాల్గు మాటలు రాసే చాన్స్ రావడం మరీ అదృష్టం. నాకు ఇష్టమయిన పాటల్లో
మొదటిది "వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనుల" ఆరాధనలో పాట.
నాకిష్టమైన సిన్మాల్లో మొదటిది - "సీతారామయ్యగారి మనవరాలు". ఈ రెండు
సిన్మాల్లో హీరో నాగేశ్వర్రావ్‌గారే!
నాకు కుర్ర వయస్సులో ఆయనే
ఇన్సిపిరేషన్. నా వృద్ధాప్యంలో కూడా ఆయనే. ఆ వయసులో, ఆయన మాదిరి నడవగల్గినా, నడుచుకోగల్గినా
మహదానందం
ప్రతి రోజూ పడుకునే ముందు ఎ.ఎన్.ఆర్‌ని
తలుచుకోకుండా జరగదు. అతిశయోక్తి కాదండి బాబూ - నిద్రలోకి జారుకునే ముందు ఓ చిన్న
చాక్‌లెట్ తినాలి కదా! ఆ చిన్న చాక్‌లెట్‌ని తనలో దాచుకుని నాకందించే బుల్లి
ఫ్రిడ్జ్.
ఎ.ఎన్.ఆర్ గారు నాకు 8 ఏళ్ళ క్రింద ఇచ్చిన గిఫ్ట్. అది నాకు అపురూపం.. అతి ప్రియం.
ఎ.ఎన్.ఆర్ శతజన్మదినాన నాకు పెద్ద
ఫ్రిడ్జ్ కొనివ్వమని కోరుకుంటూ
గురవారెడ్డి..
ఈ రోజు అంటే 28 సెప్టెంబర్ 2013 సాయంత్రం 5.30 లకు ఈ 90 ఏళ్ల యువకుడికి ఆదర సత్కారం చేయబోతున్నాం. అందరూ ఆహ్వానితులే..
This comment has been removed by the author.
ReplyDeleteచాలా మంచి పోస్టు రాశారు డాక్టర్ గారు! అసలు రిపేరీకే పనికి రాదన్న అక్కినేని గుండె అప్రతిహతంగా సెంచురీ వైపు పరుగులు తీస్తుండడం అదో పెద్ద చిదంబర రహస్యంలా అనిపిస్తుంది. అప్పట్లో సహస్రచంద్ర దర్శనం (82ఏళ్లు) పూర్తి చేసుకున్న అక్కినేని ఆరోగ్యంపై సుఖీభవలో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే ఆయన చెప్పిన ఆరోగ్యామృత గుళికలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు జల్లు కురిసింది. ఇక మీరన్నట్టు, అక్కినేని వారికి ఆ శతమానం భవతి కూడా పూర్తవగానే, మరో ఆణిముత్యాన్ని అంకితం ఇద్దామన్నది చిన్ని ఆశ! థాంక్యూ :)
ReplyDelete(కొన్ని అచ్చుతప్పులు పడడంతో పై కామెంట్ డిలీట్ చేసి, కరెక్ట్ చేసి మళ్లీ ప్రచురించాను)
Thank you very much Gurava Reddy garu. I could relate with your view of having two parties - ANR and NTR parties - when I grew up too and I am a staunch fan of ANR garu, I had big fights with my friends at that time and I even did not watch NTR's movies for one year as per a bet with my friend. Thanks for bringing back memories of Dr. Chakravarthi, 'Naa hrudamlo nidurinchae cheli' from Aradhana and also relating your close family relationship with Akkinenis - I love that family for being very simple, very disciplined, I do not know them personally but I am very much attached to their family, of course I am out and out big admirer of Nagarjuna and Amala
ReplyDelete