Social Icons

Pages

Sunday, 6 September 2015

కూరకి తాలింపు - మాటకి లాలింపు





మా అమ్మ ఎప్పుడూ ఒక సూక్తి చెప్తుండేది... 'కూరకి తాలింపు - చీరకి జాడింపు - మాటకి లాలింపు' అవసరమని. కూర సంగతి, చీర సంగతి మనకు పెద్ద తెలియదు కానీ. - మాటకి మట్టుకు లాలింపు ఉండాల్సిందేనని నా గట్టి నమ్మకం. అలా అని నేను మహా మృదుభాషాప్రవీణుడిని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మన ఒంట్లో మృదుభాషణం లేదు - మిత భాషణం అంతకన్నా లేదు. నాకు నిశ్శబ్దం నిస్తేజంలా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ వాగుతూనే, తూగుతానే (తాగుతూ కాదండీ బాబూ) బాల్చీ తన్నేయాలని నా కోరిక.
వాగుడు ఇష్టం కాబట్టి చుట్టుపక్కల వాళ్లని గమనించడం సహజమే కదా! అప్పుడు తెలిసింది ఏమిటంటే వాగుడులో చాలా రకాలుంటాయని. కొందరు ఇనుపసుత్తెలు. వారు బాదుతుంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. తప్పించుకోవచ్చు ఏదో వంకబెట్టి. కానీ మరికొందరు రబ్బరు సుత్తెలు. వీళ్లతో డేంజర్. మొదట పెద్ద నొప్పి ఉండదు. ఓ గంట పోయాక కానీ ఆ దెబ్బల ప్రభావం తెలీదు.
సంభాషణాచతురులు కొందరుంటారు. వీరితో మనం ఏం మాట్లాడ ప్రయత్నించినా దాన్ని లాఘవంగా మెడలు వంచి, విరిచి, తమవైపుకు తిప్పేసి, వారెంత ఘనాపాటులో, వారికి ఎంత పరపతి ఉందో, వారెంతమంది బడుగు వర్గాలను ఉద్ధరించారో, ఇత్యాది విషయాలన్నీ అయిదు నిమిషాల్లో చెప్పేయగలరు. కొంతమంది ప్రతి విషయానికీ, మళ్లీ మాట్లాడితే ప్రతి వాక్యానికీ వ్యంగ్య బాణాన్ని అనుసంధించి మన గుండెకి గుచ్చుకునే రీతిలో వదులుతారు. ఉదాహరణకి - 'ఇప్పుడేనా రావడం' అని పలకరిస్తే, - 'ఆహా! రాత్రికే వచ్చి, మెట్ల కింద పడుకుని, ఇప్పుడు కనపడుతున్నాను మీకు' అంటారు, సరే ఆ వ్యంగ్యాన్ని దిగమింగి, 'ఆరోగ్యం బాగుందా' అంటే 'నాకేం గుండ్రాయిలాగున్నా కనపడ్డంలా?' అని మరో విసురు.

నాకు తెలిసిన ఓ డాక్టరు స్నేహితుడుండేవాడు ఇంగ్లండులో. ఆయన పార్టీలో ఉన్నాడంటే ఆ దరిదాపులకు వెళ్ళేవాణ్ని కాదు. ఆయన డైలాగులు కొన్ని వినిపిస్తాను మీకోసం. 'ఏవాయ్, పెద్ద హాస్పిటల్ పెట్టి తెగ సంపాదిస్తున్నవటగా, జాగ్రత్త - డబ్బు జబ్బు చేసి గబ్బుపట్టిపోతావ్,', 'సూట్ కొత్తది లాగుంది - ఒరిజినల్ యేనా - మేడ్ ఇన్ చైనానా' - ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఈ డాక్టరుగారి వ్యంగ్య హాస్యాన్ని వాళ్లావిడ ఎలా తట్టుకుంటుందో - తిట్టుకుంటుందో!!
మరికొంతమంది ఊతపదాల సామ్రాట్టులుంటారు. సంభాషణలో ప్రతిమాట వెనుక ఊతపదం లేకపోతే వాళ్లకి మాటలు పడిపోతాయ్. బాపట్లలో ఓ తెలుగు టీచరుండేవాడు. 'పోనీలే' ఆయన ఊతపదం. 'సర్, రేపు స్కూల్ సెలవు' అంటే 'పోనీలే', 'సర్, తెలుగు పుస్తకం పోయింది' అంటే మళ్లీ 'పోనీలే'. ఓసారి హెడ్‌మాస్టర్ భార్య చనిపోయింది. అసెంబ్లీలో బంట్రోతు వచ్చి 'అయ్యా! హెడ్‌మాస్టర్‌గారి శ్రీమతి చనిపోయారయ్యా' అంటే ఈయన వెంటనే 'పోనీలే' అనడం జరిగింది.
ఏదో సిన్మా అనుకుంటా - ఒక ఆసామికి 'అంతా మీ దయ' ఊతపదం. 'అయ్యా బాగున్నారా?' - బాగున్నాను సార్, అంతా మీ దయ'. 'ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నట్లున్నాయ్' - అవును సార్! అంతా మీ దయ'. 'ఈ మధ్య మీకు కొడుకు పుట్టాడట కదా' - 'అవును సార్ అంతా మీ దయ'. ఇంక మాట్లాడను. ఊతపదాల గురించి స్వస్తి.
నాకు సత్సంగం అంటే చాలా ఇష్టం. మంచి మాటలు రోజూ వింటుంటే కొన్నైనా హృదయంలో తిష్ట వేసుకుని మనల్ని మంచి మార్గాన నడిపిస్తాయని నా నమ్మకం. చాగంటివారి దగ్గర నుంచి, రంగరాజన్, జగ్గీ వాసుదేవ్, ఆచార్య రజనీష్ దాకా అందరి బోధలు వింటాను.
మంచి వక్తలతో, మంచి వ్యక్తులతో కాసేపు కూర్చుంటే మనసు తరించి పోతుంది. కాకపోతే అలాంటి వ్యక్తులు దొరకడమే కష్టం. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని. వివిధ రంగాలలో నిష్ణాతులై, తల పండిపోయిన అనేకమంది గొప్పవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వారితో అవకాశం దొరికినప్పుడల్లా ముచ్చటిస్తుంటాను. ఆ సంభాషణలు నన్ను అనుక్షణం ఉత్తేజపరచి, జీవిత గమనంలో కొత్త కోణాలని ఆవిష్కరింపజేస్తుంటాయి. శాంతా బయొటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డిగారితో కాసేపు కూచుంటే - మానవీయత విలువలు ఎంత ఉన్నతంగా ఉండాలో తేటతెల్లమవుతుంది. గజల్ శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే - ఆణిముత్యాల్లాంటి జీవిత సత్యాలు దొరుకుతాయి. భగవద్గీత మొత్తం శ్లోకాలను గానం చేసిన గంగాధరశాస్త్రితో ఎంతసేపు సంభాషించినా తనివి తీరదు. శ్లోకాలను ఉటంకిస్తూ, స్వచ్చమైన స్వరంలో ఆయన అందించే సూక్తులు అంతరంగాన్ని ప్రశాంతపరుస్తాయి. బాలుగారి సాన్నిధ్యం అడపాదడపా దొరుకుతుంది. ఆయన పాటలే కాదు... మాటలు కూడా భావయుక్తంగా ఉంటాయి.
ఎదుటివారి అభిరుచిని, అనురక్తిని గమనించి, సరస సల్లాపం చేయడం అందరికీ వచ్చే విద్య కాదు. చుట్టుపక్కల జనం సంగతి వదిలేసినా.. టీవీ యాంకర్స్ మనల్ని 'చిత్ర'హింసలు పెడ్తుంటారు. కొంతమందికి ఉచ్చారణ రాదు. మరికొంతమందికి ఇంటర్వ్యూ ఎలా చేయాలో రాదు. ప్రశ్న సమాధానం కంటే నాలుగు రెట్లు నిడివి ఉంటుంది. టీవీలు వదిలేసి మంచి ఉపన్యాసం విందామని ఏ రవీంధ్రభారతికో వెళ్లామనుకోండి, కొంతమంది మైకాసురులు గంటల తరబడి మాట్లాడి, మాట్లాడి, మనల్ని ప్రసంగ బాధితుల సంఘంలో చేర్చేస్తారు. చివరగా, నేను చెప్పదలుచుకున్నదేమిటంటే - మాట్లాడటం ఓ అద్భుతమైన కళ. అది నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. ఉంది కదా అని నోరు పారేసుకోకూడదు నలుగురిలో. సున్నితంగా ప్రియభాషణం, అతి క్లుప్తంగా మితభాషణం చేయగలగాలి. మనకు రాకపోతే అలాంటివాళ్లని పెళ్లి చేసుకోవాలి. ఓ కవి రాశాడు వాళ్లవిడ గురించి అనుకుంటా. "నడిచిందంటే గుమ్మం వరకే - నవ్విందంటే అధరం వరకే - మాట్లాడిందంటే నా చెవి వరకే - కోపం వచ్చిందంటే కొద్దిపాటి మౌనం వరకే". మా ఆవిడ కూడా ఇలాంటి బాపతే.
వాల్మీకి చెప్పాడు అసలు సంభాషణ ఎలా ఉండాలో. 

 'అవిస్తరం - సుదీర్ఘంగా ఉండకూడదు. అసందిగ్ధం - అస్పష్టత ఉండకూడదు, అవిలంబితం - సాగదీసినట్టు ఉండకూడదు, అవ్యధం - నొప్పించకూడదు, ఉరస్థ కంటగం వాక్యం వర్ధతే మధ్యమ స్వరం - హృదయం నుంచి జనించిన మాటలు కంఠం ద్వారా వృద్ధి చెందుతూ మంద్రంగా మొదలై, మధ్యస్థాయి వరకే పెరగాలి తప్ప ఉచ్ఛస్వరంలో ఉండకూడదు' అని. 

నా వాగుడు వాల్మీకి లెవెల్‌కి ఎప్పుడు వెళుతుందో!!