Social Icons

Pages

Thursday 7 November 2013

డా.మృణాళినితో ఇంటర్వ్యూ




కథానికల రచయితగా, అనువాదకురాలిగా రేడియో, టెలివిజన్ హోస్ట్ గా చాలామందికి సుపరిచితురాలయిన మృణాళినితో నిన్న అంటే ఈ నెలలో మొదటి బుధవారం నేను చేసిన ఇంటర్వ్యూ  కింద లింకులో వినండి.. రియల్లీ చాలా టాలెంటెడ్ లేడీ..


గురవారెడ్డితో కబుర్లు

Sunday 29 September 2013

పుట్టినరోజు పండగే అందరికి ...




పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి... ఈ హ్యాపీ బర్త్ డే లు చిన్నపిల్లలు మాత్రమే ఎందుకు చేసుకోవాలి. అందరూ అన్నివయసులలో చేసుకోవాలంటాను. బర్త్ డే అంటే కాస్త ఎక్కువ సంతోషం , మనకంటూ కాస్త ప్రత్యేకత ఉంటాయి.. ఒప్పుకుంటారు కదా.. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులనుండి స్పెషల్ ట్రీట్మెంట్.. నిజంగా ఆ రోజంతా భలే ఉంటుంది కదా...

కాని మనకంటూ ఒక మంచిపేరు, గుర్తింపు, సమాజానికి చేతనైనంత సాయం చేసామన్న తృప్తితో పుట్టినరోజు జరుపుకోవడం .. అదో మాటలకందని అనుభూతి. కాదంటారా?

అందుకే..

హ్యాపీ బర్త్ డే టు మీ...


Saturday 28 September 2013

నేను ఎ.ఎన్.ఆర్ పార్టీ





నేను చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసేసరికి రెండే రెండు పార్టీలు ఉండేవి. మీరు  కాంగ్రెస్ - కమ్యూనిస్టు పార్టీ  అనుకుంటే కాలే పప్పులో కాలేసినట్లే.  ఎన్.టి.ఆర్.పార్టీ - ఎ.ఎన్.ఆర్ పార్టీలు అవి. నేను లాగుల్లో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్ పార్టీ. మా అమ్మమ్మ వాళ్లూర్లో, డేరా టాకీస్‌లో నేలలో కూచుని సిన్మా చూస్తూ, ఎన్.టి.ఆర్. కత్తి తిప్పుతుంటే గుర్రం తోలుతుణ్టే ఆయనతోపాటు నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోయేవాడ్ని. ఆ తర్వాత లాగుల్లోంచి పాంటుల్లోకి ఎదిగినపుడు నూనూగు మీసాలొచ్చినప్పుడు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించేసి ఎ.ఎన్.ఆర్ పార్టీలోకి జంప్ అయిపోయాను.

కారణం అబ్బే.. ఏం లేదు. పిల్ల వేషాల నుంచి 'పిల్ల' కోసం రొమాంటిక్ వేషాలు వేసే స్టేజ్‌కి నా మనసు, శరీరం ప్రమోట్ అయిపోవడమే! కత్తి తిప్పుతూ - ఒక్క కాలు మీద గెంతుతూ (అది కూడా స్కిన్ టైట్ ప్యాంట్స్‌లో) - "వగలరాణివి నీవే..."  అని పాడితే - ఆడపిల్లలు ఇంప్రెస్ అవ్వరని, స్టైల్‌గా సిల్క్ షర్ట్‌లో పియానో ముందు కూచుని " నా హృదయంలో నిదురించే చెలీ..." అని అరమోడ్పు కన్నులతో పాడితే అతివలందరూ అతి చేరువవుతారనీ  ఓ లవ్ గురు చెప్పడం వల్ల ఎ.ఎన్.ఆర్ పార్టీలో చేరిపోయాను.

అక్కడినుంచి ఎ.ఎన్.ఆర్ నన్ను వదిలిపెడితే ఒట్టు. అసలు నన్నడిగితే, 60, 70ల్లో లవ్‌లో పడ్డ ప్రతి కుర్రాడూ తెలుగునాట ఎ.ఎన్.ఆర్ వల్లే ఇన్‌స్పైర్ అయి ఉంటాడని నా గట్టి నమ్మకం. నా నడకా, మాటా , నవ్వూ, చూపు అన్నీ ఎ.ఎన్.ఆర్ లాగా ఫీల్ అయ్యేవాడ్ని. చివరికి, ఏ అమ్మాయిని చూసినా ఎడమ చెయ్యి షర్ట్ కాలర్ దగ్గరికి, కుడిచేయి గాలిలోకి అప్రయత్నంగా వెళ్లిపోతాయి. కాకపోతే సావిత్రి దగ్గర మొదలయిన రొమాన్స్ కాంచనని, వాణిశ్రీని తట్టుకొని భవానీ దగ్గర ఫలించేందుకు పదేళ్లు పట్టిందనుకోండి. అది వేరే సంగతి.

అసలా మాటకొస్తే - ఒక్క రొమాన్సే కాదు, నా కెరీర్ కూడా ఎ.ఎన్.ఆర్ ప్రభావితమే. ఎన్.టి.ఆర్ ఫాన్‌గా ఉన్నప్పుడు - నేను పెద్దయ్యాక కత్తుల షాప్ పెట్టుకుని గుర్రాల ట్రైనర్‌ని అవుదామనుకున్నాను. అలాంటిది - ఆరాధన, డాక్టర్ చక్రవర్తి సిన్మాలు చూసి, అర్జంట్‌గా డాక్టరయిపోదామని డిసైడ్ అయ్యాను.

ఈ రకంగా, ఎ.ఎన్.ఆర్ నా లైఫ్‌లో తన పరిచయానికి ముందే నా జీవితాన్ని ఇన్‌ఫ్ల్యూయన్స్ చేశారు.
1995లో నా కుమార్తె కావ్య యాక్ట్ చేసిన గుఱ్ఱం గంగరాజు డైరెక్ట్ చేసిన "లిటిల్ సోల్జర్స్"ని సమర్పించిన అక్కినేని వెంకట్ ద్వారా నాకు మొదటిగా ఎ.ఎన్.ఆర్‌గారితో పరిచయం అయింది. నేను రాణిగారిని వదిలేసి ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వచ్చి, హైదరాబాద్‌లో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది. అన్నపూర్ణమ్మగారి మోకాలు ఆపరేషన్లలో నేను కూడా భాగస్వామినవ్వడం వల్ల మా స్నేహం అనుబంధంగా మారింది. ఇప్పుడు అక్కినేని కుటుంబ సభ్యులందరితో నా రిలేషన్ 'గురవారెడ్డిగారు' నుంచి 'గురివి'కి ఎదిగింది.. ఒదిగింది.
నాగేశ్వర్రావ్ గారి జీవితం, ఆయనధిగమించిన నటనా శిఖరాలు  అందరికీ తెలిసినవే. వాటి గురించి నేను స్పెషల్‌గా రాసేదేమీ లేదు. వ్యక్తిగతంగా నాకు తెలిసిన, నేను ఇన్‌స్పైర్ అయిన కొన్ని విషయాలు చెప్తాను.

నాగేశ్వర్రావ్‌గారి డిసిప్లిన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఉదయం 6 గంటలకి ఎండయినా, వానయినా వాకింగ్ చేయాల్సిందే..(అదీ, అపుడే ఇస్త్రీ చేసినట్టు అగుపడే తెల్లని డ్రెస్‌లో). మనలాంటి అల్పజీవులం రేపుదయం వాకింగ్ ఎలా ఎగ్గొట్టాలా? అని ఈ రోజంతా ప్లాన్ వేస్తుంటాం. అలానే, ఎవరు డిన్నర్‌కి పిలిచినా టంచన్‌గా వస్తారు. 9 గంటలకి ఇంటికి వెళ్లిపోవాల్సిందే. మన హైదరాబాదులో ఒక్కోసారి 9 దాకా హోస్ట్ కూడా రాడు. భోజనాల సంగతి సరేసరి. కొన్నిసార్లు 10 దాకా ఫుడ్ సర్వ్ చేయరు. ఎ.ఎన్.ఆర్ గారి సమయపాలనా నిబద్ధత తెలుసుకున్న హోస్ట్స్ అందరూ ఆయన ఒక్కరి కోసమన్నా ఆ టైంకి భోజనం ఏర్పాటు చేసి "అమ్మయ్యా" అనుకుంటారు.

రెండో విషయం -- అంత పెద్ద సెలబ్రిటీ ఫామిలీలో తన పెద్దరికాన్ని హాండిల్ చేసే వైనం.. అద్భుతం.
మామూలుగా మనందరం ఊహించుకునేది - పెదరాయుడి టైప్‌లో కుటుంబాన్నంతా వేలిమీద ఆడిస్తూ చండశాసనుడిలాగా పాలిస్తూ ఉంటారని. కానీ నిజం ఏమిటంటే - అందరితో .. మనవళ్లతో సహా స్నేహితుడిలాగా ఉంటారు. అడిగితేనే సలహాలిస్తారు. ఫ్యామిలీ సభ్యులంతా ఆయనకిచ్చే గౌరవం అపురూపం. ప్రతి ఆదివారం లంచ్ నాగేశ్వర్రావ్‌గారింట్లో. కుటుంబమంతా కలుస్తారు. పని మీద - ఊళ్ళో లేకపోతే తప్ప. ఈ సంగమం - ఆయన ఫ్యామిలీ వాల్యూస్‌కి ఇచ్చే రెస్పెక్ట్‌కి నిదర్శనం.

సరే, వ్యక్తిత్వం, అలవాట్లు, క్రమశిక్షణ మనం ఎలాగోలా కష్టపడో, ఇష్టపడో ఏర్పరుచుకుంటాం. అంటే ఒక రకంగా ఇవన్నీ మనసుకు సంబంధించిన నియంత్రణలు. అదే రకంగా శరీరాన్ని లోనున్న ఫిజియాలజిని మనం నియంత్రించడం కష్టమైన విషయం. 'ఓ డయాలసిస్ - నా దరికి రాకు' అంటే వింటుందా? , 'ఏయ్ హార్డ్ ఎటాక్ - నా జోలికి రాబోకు' అంటే ఆగుతుందా?, 'ఓ మోకాళ్ళూ - అరగమాకండి కరగమాకండి' అంటే ఊర్కుంటాయా? .. కాని అదేం విచిత్రమో - నాగేశ్వర్రావ్‌గారు బాడీ కూడా ఆయన చెప్పు చేతల్లోనే ఉంటుంది.

ఇరవై ఏళ్ళ క్రింద అమెరికాలో "ఈయన గుండెని రిపేర్ చెయడం మావల్ల కాదు" అని ఆపరేషన్ థియేటర్‌లోంచి బయటకు పంపేశారు. ఈ రోజుకీ ఆయన్ హార్ట్ పర్‌ఫెక్ట్. ఆ డాక్టర్లందరూ ముక్కున వేలేసుకుని, నోట్లో కాలేసుకుని, ఇప్పుడు ఎ.ఎన్.ఆర్ గారి మీద డాక్యుమెంటరీ చేస్తున్నారు - 'లాంగెస్ట్ సర్వైవ్డ్ పేషంట్ ఫ్రం దెయిర్ ఇనిస్టిట్యూట్' అని. 

ఆయన నిల్చోవడం, నడవడం ఎప్పుడన్నా చూశారా? ఓ అంగుళం కూడా వంగరు. నిటారుగా మేరు నగ పర్వతంలాగ. ఆయనలో సగం వయసున్నవాళ్లు కూడా వంగి, వంగిపోయి మెడ నొప్పో, నడుం నొప్పో అంటూ మూలుగుతుంటారు.

అక్కినేనిగారితో నా పరిచయం నా అదృష్టం. ఆయన గురించి ఓ నాల్గు మాటలు రాసే చాన్స్ రావడం మరీ అదృష్టం. నాకు ఇష్టమయిన పాటల్లో మొదటిది "వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనుల" ఆరాధనలో పాట. నాకిష్టమైన సిన్మాల్లో మొదటిది - "సీతారామయ్యగారి మనవరాలు". ఈ రెండు సిన్మాల్లో హీరో నాగేశ్వర్రావ్‌గారే!
నాకు కుర్ర వయస్సులో ఆయనే ఇన్సిపిరేషన్. నా వృద్ధాప్యంలో కూడా ఆయనే. ఆ వయసులో, ఆయన మాదిరి నడవగల్గినా, నడుచుకోగల్గినా మహదానందం

ప్రతి రోజూ పడుకునే ముందు ఎ.ఎన్.ఆర్‌ని తలుచుకోకుండా జరగదు. అతిశయోక్తి కాదండి బాబూ - నిద్రలోకి జారుకునే ముందు ఓ చిన్న చాక్‌లెట్ తినాలి కదా! ఆ చిన్న చాక్‌లెట్‌ని తనలో దాచుకుని నాకందించే బుల్లి ఫ్రిడ్జ్.
ఎ.ఎన్.ఆర్ గారు నాకు 8 ఏళ్ళ క్రింద ఇచ్చిన గిఫ్ట్. అది నాకు అపురూపం.. అతి ప్రియం.
ఎ.ఎన్.ఆర్ శతజన్మదినాన నాకు పెద్ద ఫ్రిడ్జ్ కొనివ్వమని కోరుకుంటూ


గురవారెడ్డి..



ఈ రోజు అంటే 28 సెప్టెంబర్ 2013 సాయంత్రం 5.30 లకు ఈ 90 ఏళ్ల  యువకుడికి ఆదర సత్కారం చేయబోతున్నాం. అందరూ ఆహ్వానితులే..

Tuesday 17 September 2013

వినాయక చవితి జ్ఞాపకాలు




అవిఘ్నమస్తు

చిన్నప్పుడు మా నాన్న "పండగ కాదు దండగ" అంటుంటేవాడు. నిజమే  మధ్యతరగతి కుటుంబానికి, సంవత్సరానికి కనీసం పది పండగల ఖర్చు వేసుకున్నా negative budgetలోకి వెళ్లడం ఖాయం కానీ పిల్లలకి మటుకు నిజంగా పండగే. నా చిన్నవనంలో అన్నీ పండుగలు మొహమాటం లేకుండా celebrate చేసుకునేవాడ్ని.
ప్రస్తుతం వినాయక చవితి కాబట్టి కాసేపు ఆ కబుర్లు చెప్పుకుందాం. నా బాల్యం అంతా బాపట్లలోనే. నన్నడిగితే enjoy చేయడానికి సరైన place.. మరీ పల్లెటూరు కాదు పెద్ద నగరమూ కాదు. చిన్న పట్టణం. రెండు సిన్మా హల్స ఉండేవి. చిత్రకళామందిరం, దుర్గ కళామందిరం అని.. ఒకటి వినపడదు - ఒకటి కనపడదు అని జోక్స్ వేసుకునేవాళ్లం. బాపట్లలో మేం మాయాబజార్‌లో ఉండేవాళ్లం. అక్కడ దొంగలు ఎక్కువని. కాసేపు ఏమరుపాటయితే వస్తువులు మాయమవుతాయని నానుడి. వస్తువుల సంగతి  ఏమోకాని.. అమ్మ కాస్త అటు తిరగ్గానే మేం మాయమయేవాళ్లం.
వినాయక చవితిరోజు మొత్తం మాంచి సరదాగా, బిజీగా ఉండేది. ఉదయం అభ్యంగ స్నానం తప్పనిసరి. ఆ రోజుల్లో ఈ షాంపూలు అందుబాటులో లేవు. atleast మా ఇంట్లో. కుంకుడురసం - అది కళ్లలోకి పోవడం తథ్యం. కళ్ళు మండడం అనివార్యం. మా అమ్మ చెప్పేది. "కళ్లకి మంచిది నాన్నా! " అని. కళ్ళు మండటంతో  మొదలయేది రోజు. ఆ కష్టాలు అప్పుడే అవ్వలేదు. ముందస్తుగా అమ్మ కష్టపెట్టేది. తర్వాత నాన్న వంతు. పూజ అయ్యేదాకా No Food.  ఆ పూజేమో తెలుగు టీవీ సీరియల్‌లాగా సాగుతూ, సాగుతూ ఓ రెండు గంటలు పట్టేది. మా ధ్యాసంతా పానకం, ఉండ్రాళ్ళు, గారెలమీదే. ఎలాగో కష్టపడి, పూజ విన్నాం అనిపించేవాళ్లం. (ఇపుడు ఆ పూజా కార్యక్రమం నా మీద పడిందనుకోండి... అది వేరే సంగతి) ఫుల్లుగా  పిండివంటల్ని లాగించి ఊరి మీద పడేవాళ్లం. అపుడే మొదలయ్యేది అసలు ఆనందం.
మరి ఏ పురాణాల్లో చెప్పారో లేక బాపట్ల చరిత్రలో రాశారో.. ఆ రోజుల్లో " వినాయకచవితి రోజు తిట్లు దీవెనలుగా మారతాయని". సో మాకు ఆ రోజు గారెలతో పాటు తిట్లు కూడా వినడం ప్రధమకర్తవ్యంగా ఉండేది. తిట్లు ఊరికే రావు కదా. సంపాదించాలి. అందుకోసం ఓ బృహత్పధకం వేసేవాళ్లం. కాసరగడ్డలు, పల్లేరు కాయలు సంపాదించడం అన్నమాట. కాసరగడ్డలు అంటే మన ఉల్లిపాయల్లా ఉండేవి. ఊరిబయట, తోపుల్లో దొరికేవి. కాసరగడ్డలు  రోడ్డుమీద పోయే బాటసారుల మీద విసరడం ... వాళ్లు తిట్టడం మొదలెట్టగానే పరుగు లంకించుకోవడం .. అలానే పల్లేరుకాయలు రోడ్డుమీద, చిన్న చిన్న కిరాణా కొట్ల ముందు వేయడం. జనం వాటిని తొక్కి బాధపడుతుంటే మేం నవ్వడం.. అది చూసి వాళ్లు తిట్టడం.. మళ్లీ పరుగు లంగించుకోవడం.. చూశారా.. తిట్లు తినడానికి ఎని కష్టాలు, ఎంత శ్రమ పడేవాళ్లమో!!!
మొత్తం మీద చాతనయినంత తిట్లు సంపాదించుకుని భోజనం టైంకి ఇంటికి చేరేవాళ్లం. అదృష్టం బాగోలేక మాకు దీవెనలిచ్చిన బాటసారులెవరైనా వెంటబడి ఇంటికి వచ్చారనుకోండి. అప్పుడు అమ్మకంటే ముందు నాన్న వడ్డించేవారు. భోజనం మాత్రం అద్భుతం. గారెలు, బూరెలు, పులిహోర, పాయసం. కమ్మగా లాగించి బ్రేవుమని తేన్చి రేడియో ముందు చేరేవాళ్లం. మధ్యాన్నం మూడింటికి "సంక్షిప్త శబ్దచిత్రం" అని వచ్చేది రేడియోలో. ఇంటిల్లిపాది అక్కడే. బొమ్మలు చూడకుండా డైలాగులలో సిన్మా మొత్తం ఊహించుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి.
సాయంత్రం మళ్లీ రోడ్ల మీదకి. ఈసారి తిట్ల కోసం కాదులెండి ఆడుకోవడానికి. ఓ జేబులో వేయించిన వేరుసెనక్కాయలు. ఇంకో జేబులో బెల్లం గడ్డ. పండగ స్పెషల్ కదా.. అప్పుడే రెండు రవ్వలడ్లు కూడా దొరికేవి. కుందుళ్ళు, కబడి. పిచ్చి బంతి, కొంచెం పెద్దయినాక బాడ్మింటన్. ఎవడన్నా సైకిల్ తెస్తే ఇక దాని మీద పడి విధ్వంసం చేసేదాకా వదిలేవాళ్లం కాదు.
ఇక క్రికెట్ మా లెవల్ కాదు. అది ఆ రోజుల్లో కాలేజీ గేమ్. ఒక్కోసారి నాన్న మూడ్ బావుంటే రాత్రి సినిమా చాన్స్ దొరికేది. అదే చిత్రకళామందిరంలోనో - దుర్గకళామందిరంలోనో.
వినాయకచవితి అంత హాయిగా గడిచిపోయేది. ఉదయాన ఆందరం మా పుస్తకాలన్నీ దేవుడి దగ్గర పెడితే నాన్న వాటికి పసుపు, కుంకుమ పెట్టేవాడు. నాకయితే  ఆ బొట్లు ఎంత పెద్దగా పెడితే అన్ని మార్కులు చదవకుండా వస్తాయనే నమ్మకం ఉండేది.
హైదరాబాదు వచ్చిన తర్వాత వినాయక్ చవితి perspective మారిపోయింది. పెద్ద పెద్ద పందిళ్లు, విగ్రహాలు, నిమజ్జనం, కోలాహలం. వినాయకుడిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్లాయి. పది ఏళ్ళనుంచి ప్రయత్నిస్తున్నాను ఒక్కసారన్నా నిమజ్జనం కోలాహలం experience చేద్దామని. కుదరడం లేదు. ఉదయాన పూజ మట్టుకు చాలా Sincereగా చేస్తున్నానండోయ్.

మీ అందరి కోరికలు, ఏ విఘ్నాలు లేకుండా తీరాలని ఆ వినాయకుడిని ప్రార్ధిస్తూ సెలవు.
                                                                                                    
                                                                                                               మీ గురవారెడ్డి.


ఇంకో మాట చెప్పాలి. గత బుధవారం తరంగ రేడియోలో వినాయక చవితిగురించి మరిన్ని కబుర్లు చెప్పాను. వినేయండి. ఓ పనైపోతుంది.


 

Wednesday 14 August 2013

మల్లెలతీరంలో సిరిమల్లె చెట్టు టీమ్ తో నా ముచ్చట్లు


హాయ్ ఫ్రెంఢ్స్...

మీకు తెలుసు నేను మనుషుల కీళ్లతో ఆటలాడుకుని , విరిగితే సరిచేస్తానని. కాని అప్పుడప్పుడు రేడియో తరంగాలో నా మాటలతో జనాలను పీడిస్తానని ఎక్కువమందికి తెలియదు. మరి ఈ  టాలెంటును మరుగుపెట్టడమెందుకని ప్రతీ నెలలో రెండవ బుధవారం రేడియో జాకీయింగ్ (గుర్రాలట కాదండోయ్! అపార్ధం చేసుకోవద్దు... )   చేస్తున్నాను. మరి ఇవాళ నాకు చాలా చాలా నచ్చిన సినిమా మల్లెలతీరంలో సిరిమల్లె చెట్టు సినిమా టీమ్ తో కాసిన్ని ముచ్చట్లు, కాసిన్ని పాటలు విందురు గాని ..
ఇవాళ  అంటే బుధవారం 14.8.2013 రాత్రి 8.30 నుండి 10.30  వరకు తరంగ రేడియో ద్వారా మాట్లాడుకుందాం.  మీరు కూడా కాల్ చేయండి. మరి.. ఇదిగోండి. వివరాలు..

తరంగ రేడియో ప్లేయర్ లింక్..

http://tharangamedia.net/TharangaPlayer/index.php?sname=telugulive

ఇక మీరు కాల్ చేయవలసిన నంబర్లు , మెయిల్ ఐడి, స్కైప్ ఐడి..

U.S.A  - (201) 340 - 1950  ..... (201) 345 - 4939

India  -  (040) 667 - 78403

Email: telugu@tharangamedia.com

Skype ID :  telugu.tharanga


 సరే మరి రాత్రి కలుద్దాం..

Wednesday 10 April 2013

డా.గురవారెడ్డితో కబుర్లు - పండగ ముచ్చట్లు






నమస్కారం.. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ఇంతకుముందు తరంగలో రేడియో షో చేస్తానని చెప్పి హ్యాండిచ్చా కదా. కాని నా చేతిలో ఏమీ లేదండి. ఆరోజు హాస్పిటల్ లో కాస్త ఎమర్జెన్సీ రావడం వల్ల అస్సలు కుదరలేదు. ప్చ్... డాక్టర్లం కదండి తప్పదు..

మరి ఇవాళ రాత్రి కలుద్దామా? రేపు ఉగాది పండగ కదా.. మరి ఉగాది గురించి, మనకు మాత్రమే సొంతమైన పండగల గురించి మంచి మంచి మాటలు చెప్పుకుందాః.. ఇవాళ  అంటే బుధవారం 10.4.2013 రాత్రి 8.30 నుండి 10.30  వరకు తరంగ రేడియో ద్వారా మాట్లాడుకుందాం. మంచి మంచి విశేషాలు, పిండివంటలు, పాటలు అన్నీ పంచుకుందాం. మీరు కూడా కాల్ చేయండి. మరి.. ఇదిగోండి. వివరాలు..

తరంగ రేడియో ప్లేయర్ లింక్..

http://tharangamedia.net/TharangaPlayer/index.php?sname=telugulive



ఇక మీరు కాల్ చేయవలసిన నంబర్లు , మెయిల్ ఐడి, స్కైప్ ఐడి..

U.S.A  - (201) 340 - 1950  ..... (201) 345 - 4939


India  -  (040) 667 - 78403

Email: telugu@tharangamedia.com

Skype ID :  telugu.tharanga




 సరే మరి రాత్రి కలుద్దాం..

Wednesday 13 March 2013

కొంచెం సరదాగా ... కొంచెం సీరియస్ గా...




సీరియస్సుగా అన్నానని ఖంగారు పడకండి.. నేను సరదాగానే ఉంటాను కాని ఇవాళ తరంగ రేడియోలో కాస్త సీరియస్ విషయం  మీద మాట్లాడదామనుకుంటున్నాను. ఈ మధ్య జరిగిని డిల్లీ దారుణం, ఎంత ఆందోళన జరిగినా తగ్గని మహిళలపై అత్యాచారాలు,  మనమందరం ఘనంగా జరుపుకున్న మహిళా దినోత్సవ సంధర్భంగా  మహిళలకు సంబంధించిన సమస్యలు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావిద్దామని ఆలోచన వచ్చింది. అందుకని నాతోపాటు మాట్లాడటానికి ప్రముఖ రచయిత్రి డా.మృణాలిని, సూపర్ బ్లాగర్ జ్యోతి వలబోజుగారిని ఆహ్వానించాను. వాళ్లు వస్తామన్నారు.. ఇంకేం మరి ఈ రోజు రాత్రి 8.30 గంటలనుండి 10.30 గంటల వరకు తరంగ రేడియో ఆన్ చేసుకోండి. మా మాటలు వింటూ మీరు కూడా కాల్ చేసి మాట్లాడొచ్చు మరి.. మరి రాత్రి మీ పనులు త్వరగా పూర్తి చేసుకుని తీరిగ్గా వింటారు కదా..



తరంగ రేడియో ప్లేయర్ లింక్..

http://tharangamedia.net/TharangaPlayer/index.php?sname=telugulive



ఇక మీరు కాల్ చేయవలసిన నంబర్లు , మెయిల్ ఐడి, స్కైప్ ఐడి..




U.S.A  - (201) 340 - 1950  ..... (201) 345 - 4939


India  -  (040) 667 - 78403

Email: telugu@tharangamedia.com

Skype ID :  telugu.tharanga



 సరే మరి రాత్రి కలుద్దాం.. మరో మాట.. మహిళా  దినోత్సవం సందర్భంగా మా సన్ షైన్ హాస్పిటల్స్ తరపున ఒక బహుమతి.  మీ అమ్మకు కాని, అక్కకు కాని, చెల్లెలికి కాని, స్నేహితురాలికి కాని ఈ బహుమతి ఇవ్వండి. అమ్మాయిలూ(అమ్మలూ) మీకు మీరు ఈ బహుమతి ఇచ్చుకోండి.







.






Tuesday 12 March 2013

డా.గురవారెడ్డితో కబుర్లు .. అంటే నాతోనేనండోయ్..





ఎప్పుడూ సూదులు, మందులు, కత్తులు, కటార్లతో విసుగెత్తి , ఆన్లైన్ రేడియో తరంగ వాళ్లతో అఫ్పుడప్పుడు అంటే నాకు తీరిక దొరికినప్పుడు కబుర్లు చెప్తుంటాను. మీరెప్పుడైనా విన్నారా?? రేపు రాత్రి ఒక స్పెషల్ షో చేయబోతున్నాను. మీకందరికి అది తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. పూర్తి వివరాలు మళ్లీ చెప్తాను. అంతవరకు నేను ఇంతవరకు చెప్పిన కబుర్లన్నీ ఇక్కడ వినండి. ఓ పనైపోతుంది...


గురవారెడ్డితో కబుర్లు..

Sunday 10 February 2013

జ్యోతిగారికి ధాంక్స్....

 వారంలోని అన్ని రోజులకంటే శనివారాలు నాకు చాలా ఇష్టం. సోమవారం నుండి శుక్రవారం వరకు పేషంట్లతో, ఆపరేషన్లతో   బిజీ బిజీగా ఉంటాను.  శనివారం మాత్రం నాకోసమే అట్టి పెట్టుకున్నా. ఆ రోజు నా బాస్ (భార్యామణి) కూడా పని చేస్తుంది. ఆదివారం మొత్తం ఆమె కోసమే ధారాదత్తం  చేశా. నా లైఫ్ ని చాలా క్లారిటీ తో ప్లాన్ చేసేసాను. అఫ్కోర్స్ ఆదివారాలు కూడా మా ఆవిడని మాయ చేసి నాకు నచ్చిన పనులే చేస్తుంటా అనుకోండి... అది వేరే సంగతి..

ఈ శనివారం అంటే నిన్న ఓ స్పెషల్ అతిథి మా ఇంటికి వచ్చారు. జ్యోతిగారు, వాళ్ళబ్బాయి చైతన్య. ఎందుకంటారా? వైద్యానికి కాదండి బాబు. పాఠాలు చెప్పడానికి. ఎంతో  శ్రమ తీసుకుని మా ఇంటికి వచ్చి మరీ బ్లాగ్వద్గీత బోధించారు. నా మట్టిబుర్ర కొంత వికసించింది. వాళ్ళబ్బాయి కూడా కొన్ని టెక్నికల్ విషయాలు నేర్పించాడు.

ఏదో ఒక రోజు నేను కూడా జ్యోతిగారిలా, చందు శైలజలా, రమణలా  (అదేనండి మీకు తెలిసిన పనిలేక బ్లాగర్)  గొప్ప బ్లాగ్ బస్టర్  అయిపోవాలని నాకు నేనే ఆశీర్వదించుకుంటూ ................ స్వస్తి ...

మీ గురవారెడ్డి.






నేను నా గురించి....

CVR చానెల్ కోసం నేను నాగురించి చెప్పుకున్న మరపురాని, మరువలేని జ్ఞాపకాలు..



సాక్షి టీవీ - విజేత

గత సంవత్సరం సాక్షి టీవీలో విజేత అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

Open Heart with R.K

ABN చానెల్ లో రాధాకృష్ణగారు మనసు విప్పి మాట్లాడే ప్రోగ్రామ్ మీకు తెలిసిందే అనుకుంటా. ఓసారి నాకు కూడా పిలుపొచ్చింది. సరే కాస్త సరదాగా సరదాగా (ప్రోగ్రామ్ లో చెప్పినట్టు గుండె విప్పి కాదండోయ)  మాట్లాడదాం అని వెళ్లా. మరి ఎలా ఉందో మీరే చెప్పాలి..


మా (టీవీలో) పెళ్లి పుస్తకం

అప్పుడెప్పుడో రెండేళ్ల క్రింద అనుకుంటా మాటీవీ వాళ్లు మీ పెళ్లి ముచ్చట్లు చెప్పండంటేనూ ఓసారి వెళ్లొచ్చాం .. స్వాతి సోమనాధ్ గారితో మా దంపతుల ముచ్చట్లు మీరు కూడా చూస్తూ వింటారా మరి..

పెళ్లి పుస్తకం